గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గాజా సిటీపై ఇజ్రాయెల్ విరామం లేకుండా భారీ ఆయుధాలను ప్రయోగిస్తూనే ఉంది. ఎక్కడ చూసినా నేలమట్టం అయిన భవనాలే కనిపిస్తున్నాయి. పౌరుల భద్రతపైనా ఆందోళన చెందుతోంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం 23 లక్షల మంది గాజా ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో లక్షల మంది ఇళ్లను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్తున్నారు. 


అన్నపానీయాల కోసం ప్రజలు అలమటిస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గాజా అంతటా కుళాయిల నుంచి నీరు రావడం ఆగిపోయింది. వచ్చిన నీరూ కలుషితంగా ఉంటోంది. దీంతో ఉప్పు నీరే తాగాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రాంతానికి వెళ్లలేని వారు బాధితులు కొందరు ఆసుపత్రుల వద్దకు చేరుకుంటున్నారు. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అయిన అల్‌ షిఫాలో 35,000 మంది ఉన్నారు. పలువురు గాయాలతో కారిడార్లలో, ఆవరణలోని చెట్ల కింద వేచి ఉన్నారు. తమ ఇళ్లన్నీ ధ్వంసం కావడంతో ఆసుపత్రి సురక్షిత ప్రాంతమని అందరూ ఇక్కడికి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇంధనంతోపాటు కనీస అవసరాలకు సామగ్రి లేకపోవడంతో ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సహాయక సామగ్రి అందకపోతే వేల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


మరోవైపు ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. మందులు, ఇతర సామగ్రి నిండుకున్నాయి. వాటి సరఫరాను అడ్డుకుంటే వేల మంది మరణించే అవకాశముందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్‌కు అమెరికా మరింత మద్దతుగా నిలుస్తోంది. మరో విమాన వాహక యుద్ధనౌకను పంపింది. గాజాలో ఇప్పటిదాకా 2,329 మంది మరణించారు. 2014లో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరిగిన యుద్ధంలో కంటే ఈసారి మరణాలు అధికంగా నమోదయ్యాయి. అప్పట్లో గాజాలో 2,251 మంది మరణించగా ప్రస్తుతం మరణాల సంఖ్య 2,329కి చేరుకుంది. అప్పట్లో 74 మంది ఇజ్రాయెలీ సైనికులు పౌరులు మృతి చెందారు. తాజా హమాస్‌ దాడుల్లో 1,300 మంది మరణించారు.


ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ కరపత్రాలను హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తోంది. సోషల్ మీడియాలోనూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కారిడార్‌ ద్వారా లక్షల మంది వలస బాట పట్టారు. అయితే ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారిని హమాస్‌ అడ్డుకుంటోంది. ప్రజలను రక్షణ కవచంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. దక్షిణ ఇజ్రాయెలీ పట్టణం సెరాత్‌ నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఆదివారం వారంతా దేశంలోని ఇతర ప్రాంతాలకు బస్సుల్లో, ఇతర వాహనాల్లో వెళ్లారు. గాజా నుంచి రాకెట్‌ దాడుల భయంతో వారంతా ఇళ్లను ఖాళీ చేశారు. బందీలు తమ వద్ద ఉన్నంతవరకూ ఇజ్రాయెల్‌ భూతల పోరుకు దిగబోదని హమాస్‌ స్పష్టం చేసింది. యుద్ధంలో హెజ్‌బొల్లాతోపాటు స్థానిక దళాలు పాల్గొనే అవకాశముందని తెలిపింది.


మారణకాండకు బాధ్యుడైన హమాస్‌ కీలక కమాండర్‌ బిలాల్‌ అల్‌ కేద్రాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది. హమాస్‌ మిలిటరీ విభాగంలోని నావికాదళ కమాండో యూనిట్‌కు బిలాల్‌ అల్‌ కేద్రా నాయకత్వం వహిస్తున్నాడు. బిలాల్‌తోపాటు పలువురు హమాస్‌ మిలిటెంట్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన తెలిపింది. జేతున్‌, ఖాన్‌ యూనిస్‌, పశ్చిమ జబలియా ప్రాంతాల్లో 100కుపైగా లక్ష్యాలపై దాడులు చేసింది. జబాలియా శరణార్థ శిబిరంవద్ద ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 27 మంది మరణించారని, 80 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.