Jerry And Marge Selbee: లాటరీ రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేస్తుంది. అయితే అందుకు కొంచెం అదృష్టం ఉండాలి. ఎక్కడో ఒక చోట లాటరీ తగిలి ఓవర్ నైట్‌లో కోటీశ్వరులయ్యారంటూ వస్తున్న వార్తలను నిత్యం చూస్తూనే ఉంటాం. కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు గత ఏడాది  దుబాయ్‌లొ మహ్జూజ్ సాటర్ డే మిలియన్స్ డ్రాలో ఏకంగా రూ. 45కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే అద‌‌ృష్టాన్ని కాదని లాటరీ టికెట్ నంబరింగ్‌లోని చిన్న లాజిక్‌తో ఓ జంట వందల కోట్లు సంపాదించారంటే నమ్ముతారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. లాటరీ టికెట్ నంబరింగ్‌లో ఉన్న లూప్ హోల్‌తో అమెరికాకు చెందిన ఓ వృద్ధ జంట ఏకంగా రూ.200 కోట్లు సంపాదింది. వారి పేరుతో ఏకంగా సినిమా కూడా వచ్చింది.


లాటరీ నంబరింగ్‌లో లూప్ ​హోల్ పట్టేశాడు 
మిచిగాన్‌​లో‌ని ఇవార్ట్ ప్రాంతానికి చెందిన జెర్రీ(80), మార్జ్ సెల్బీ(81) చిన్నపాటి దుకాణం నడిపేవారు. వారికి 60 ఏళ్ల వచ్చేవరకు ఆ దుకాణమే వారికి జీవనాధారం. తరువాత వయసు మీదపడడంతో 2003లో దుకాణాన్ని మూసేశారు. ఆ సమయంలో ఓ విషయం వారిని ఆకర్షించింది. ‘విన్​ఫాల్’ అనే కొత్త లాటరీ గేమ్‌​కు సంబంధించిన బ్రౌచర్‌​ను చూసిన సెల్బీ.. అందులో ఎలాగైనా జాక్​పాట్ కొట్టాలనుకున్నాడు. 


ప్రాబబులిటీతో లెక్కలు
చిన్నప్పటి నుంచే మ్యాథమెటిక్స్‌లో ప్రావీణ్యం ఉన్న మార్జ్ సెల్బీ ప్రాబబులిటీ (సంభావ్యత)లెక్కలు వేసి అందులో రిస్క్ రివార్డ్‌ను కౌంట్ చేసి విన్నింగ్ టికెట్ ఏదో కనిపెట్టేశాడు. విన్​ఫాల్ గేమ్‌​లో జాక్‌​పాట్ 5 మిలియన్ డాలర్లకు చేరుకుని ఎవ్వరూ గెలవకపోతే, మిగతా టికెట్లలో విన్నింగ్ నంబర్లు ఎక్కువగా మ్యాచ్ అయినోళ్లకే ఆ మొత్తం అమౌంట్ షేర్ అవుతుందని పసిగట్టాడు. దీంతో తాను ఎన్ని టికెట్లు కొంటే తనకు కలిసివస్తుందో లెక్కలు వేశాడు. 


విన్నింగ్ ఫార్ములా కనిపెట్టేశాడు
1,100 టికెట్లపై 1100 డాలర్లు పెడితే.. వాటిలో వెయ్యి డాలర్లు ప్రైజ్ గెలిచే 4 అంకెల విన్నింగ్ నంబర్ల టికెట్లలో ఒక్కటైనా తనకు తగిలే ప్రాబబులిటీ ఉంటుందని సెల్బీ అంచనా వేశాడు. అలాగే, 50 డాలర్ల లాటరీ టికెట్లలో 3 నంబర్లు మ్యాచ్ అయ్యే టికెట్లు కూడా 18 నుంచి 19 టికెట్లు తనకు రావొచ్చని అంచనా వేశాడు. మొత్తానికి 1,100 డాలర్లు పెట్టి 1,900 డాలర్లు గెలవచ్చని కన్ఫామ్ చేసుకున్నాడు. 


ఏకంగా రూ.200 కోట్లు
ఆ తరువాత అసలు ఆట ప్రారంభమైంది. అప్పటి నుంచి డాలర్లకు డాలర్లు చిన్న మొత్తాల్లో సంపాదిండం మొదలు పెట్టాడు. మొదటిసారి 3,600 డాలర్లు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి 6,300 డాలర్లు గెలిచాడు. అదే అంచనాలతో మరోసారి 8 వేల డాలర్లు పెట్టి 16 వేల డాలర్లు గెలిచాడు. 9 ఏళ్లలో ఏకంగా 26 మిలియన్ డాలర్లు సంపాదించాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 200 కోట్లకు సమానం అన్న మాట. సెల్పీ జంట స్టోరీపై ‘జెర్రీ అండ్ మార్జ్ .. గో లార్జ్’ పేరిట సినిమా కూడా వచ్చింది.


పోలీసుల విచారణ
సెల్పీ పెద్ద మొత్తంలో సంపాదించడంపై పోలీసులు సైతం విచారణ చేపట్టారు. అతను అంత పెద్ద మొత్తాలను ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకునేందుకు ఇన్‌స్పెక్టర్ జనరల్ విచారణ జరిపింది. అయితే, సెల్బీలు నిబంధనల ప్రకారం లాటరీ ఆడి గెలుస్తున్నారని, అందులో చట్టవిరుద్ధం ఏమీ లేదని గుర్తించారు.