Hidden Treasure In Pakistan Indus River: పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలోని సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలున్నాయని.. వాటి విలువ దాదాపు రూ.18 వేల కోట్లు (600 బిలియన్ పాకిస్థానీ రూపాయలు) ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్‌పీ) కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై పూర్తి దృష్టి సారించినట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. '32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలు గుర్తించాం. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లలో సైతం బంగారు నిల్వలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై నిషేధం అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుంది.' అని స్పష్టం చేశారు.

అంత బంగారం ఎక్కడిదంటే.?

సింధు నది హిమాలయాల్లో జన్మించి పాక్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తోంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అవి సింధు నదీ ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌లోని నదీ పరీవాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా, ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోయాయి. ఇవే ఇప్పుడు టన్నుల కొద్దీ బంగారంగా మారాయి.

పాక్ ప్రజల కష్టాలు తీరేనా..?

అయితే, ఈ బంగారు నిల్వలతో పాక్ ఆర్థిక వ్యవస్థ బలపడి అక్కడి ప్రజల కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఓ వైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మారింది. అటు, వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో బంగారు నిల్వలు బయటపడ్డాయనే వార్త అందరిలో కొత్త ఆశలు రేకెత్తించింది. వెలికితీత ప్రక్రియ మొదలైతే పాక్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుంది. దేశంపై ఉన్న అప్పుల భారం తగ్గడం సహా కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. దీంతో నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్యులకు ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Also Read: Los Angeles Wildfires: లాస్ఏంజెలెస్‌లో ఆరని కార్చిచ్చు - హాలీవుడ్ స్టార్లపై ఆగ్రహం, ఎందుకో తెలుసా?