ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా రూపంలో సవాల్ ఎదురుకానుందా అంటే అవుననే అంటున్నాయి ఇజ్రాయెల్ నిఘా వర్గాలు. లక్షకు పైగా రాకెట్లు, క్రియాశీల సభ్యులు, ఏ అంశంలో తీసుకున్నా హమాస్ కంటే ప్రమాదకరం హిజ్బుల్లా. లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన ఈ సంస్థ ఇరాన్ అండదండలతో బలమైన శక్తిగా ఎదిగింది. ఇందుకు కారణం ఇరాన్. ఆర్థికంగా, ఆయుధపరంగానూ హిజ్బుల్లాకు ఇరాన్ సాయం చేస్తోంది.
గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా
హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు ఆయా ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించవు. అయితే గెరిల్లా యుద్ధంలో ఆరితేరాయి. యుద్ధరంగంలో ఎదురుగా నిలబడిన శత్రువుతో ముఖాముఖి పోరాటం చేస్తాయి. అయితే గెరిల్లా యుద్ధంలో ఇలా ఉండదు. సాధ్యమైనంత తక్కువ ప్రాణనష్టంతో వైరిపక్షానికి తీవ్రనష్టం కలిగిస్తాయి. ఇజ్రాయెల్ దళాలు సుశిక్షితమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. గెరిల్లా యుద్ధంలో సందర్భానుసారంగా వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో హమాస్, హిజ్బుల్లా ఉగ్రసంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది.
హిజ్బుల్లా వద్ద లక్షకుపైగా రాకెట్లు
హిజ్బుల్లా వద్ద ఊహించని విధంగా ఆయుధాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా వేస్తుననాయి. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనాను స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే హిజ్బుల్లా అంతిమలక్ష్యం. హమాస్ ఉగ్రదాడి తర్వాత కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది. తేరుకున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1980ల్లో లెబనాన్‌లో హిజ్బుల్లా ఏర్పాటయింది. రాజకీయంగానూ, మిలటరీపరంగానూ బలంగా ఉంది. ఒక్క రాకెట్లే కాదు, స్వల్పలక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు పాశ్చాత్య నిఘావర్గాలు చెబుతున్నాయి.
38 ఏళ్ల క్రితమే ఘర్షణలు
ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా దాడులు చేయడం కొత్తేమీ కాదు. 1985, 2000, 2006ల్లో ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరిగాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, ఇరాన్ దళాలతో పాటు హిజ్బుల్లా ప్రవేశంతో సిరియా ప్రభుత్వం, తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేసింది. 2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాదాపు 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్ దళాలు వెనక్కు మళ్లాయి. అయితే ఈ యుద్ధం తరువాత హిజ్బుల్లా ఆయుధ శక్తి భారీగా పెంచుకుంది.
గాజాలోని హమాస్ నెట్‌వర్క్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టేందుకు ఇజ్రాయెల్ సిద్దమైంది. ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులు తక్షణమే, ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణభయంతో పాలస్తీనీయులు వలసబాట పట్టారు. అయితే ఇజ్రాయెల్ నిరంతర వైమానిక దాడులతో వీరు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే వీరి కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరలింపు కారిడార్లను అందుబాటులో ఉంచినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఆ గడువులో ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచించింది.