Hantavirus Level 3  emergency response: అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న నెదర్లాండ్స్‌కు చెందిన విలాసవంతమైన క్రూయిజ్ షిప్  MV హోండియస్  లో  హంటా వైరస్   కలకలం రేపుతోంది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ నౌకలో ప్రాణాంతకమైన ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ అసాధారణ పరిస్థితులతో స్పెయిన్ ప్రభుత్వం ఈ నౌకను కానరీ ఐలాండ్స్‌కు వచ్చేందుకు అనుమతించింది. అక్కడ ప్రయాణికులను ఖాళీ చేయించి, ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Continues below advertisement

 అసలేం జరిగింది? 

ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనాలోని ఉషుయా నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 11న ఒక 70 ఏళ్ల డచ్ పౌరుడు నౌకలోనే మరణించారు, మొదట ఇది సహజ మరణమని భావించారు. అయితే, ఏప్రిల్ 24న సెయింట్ హెలెనాలో దిగిపోయిన ఆయన భార్య కూడా దక్షిణాఫ్రికాలో విమానం ఎక్కబోతుండగా మరణించారు. ఆ తర్వాత మే 2న ఒక జర్మన్ మహిళ కూడా నౌకలోనే ప్రాణాలు కోల్పోయారు. పరీక్షల తరవాత వారందరికీ హంటా వైరస్ నిర్దారణ అయింది.  ప్రస్తుతం ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మరో తొమ్మిది మంది అనుమానిత లక్షణాలతో ఉన్నారు.

Continues below advertisement

 అండీస్ స్ట్రెయిన్ - మానవ వ్యాప్తి ముప్పు 

సాధారణంగా హంటా వైరస్ ఎలుకల మలమూత్రాల ద్వారా వ్యాపిస్తుంది. కానీ ఈ నౌకలో వ్యాప్తి చెందుతున్నది  అండీస్ వైరస్ స్ట్రెయిన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  గుర్తించింది. ఈ రకమైన వైరస్ అత్యంత అరుదుగా ఒక మనిషి నుంచి మరొక మనిషికి  సోకే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు మరియు సిబ్బంది నౌకలోని పరిమిత ప్రదేశాల్లో దగ్గరగా ఉండటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

 కానరీ ఐలాండ్స్‌లో హై అలర్ట్ 

నౌక ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన టెనెరిఫె ,  గ్రాన్ కానరియా ఓడరేవు వైపు వెళుతోంది. మే 10  నాటికి ఇది అక్కడ చేరుకునే అవకాశం ఉంది. స్పెయిన్ అత్యవసర సేవల విభాగం ఇప్పటికే ఓడరేవు సమీపంలో ఒక ప్రత్యేకమైన  ఐసోలేటెడ్ జోన్ ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులను బయటకు తీసుకువచ్చేటప్పుడు స్థానిక ప్రజలకు ఎటువంటి ముప్పు కలగకుండా పటిష్టమైన బందోబస్తు , పీపీఈ కిట్స్‌ను సిద్ధం చేశారు.  

 భారతీయులు, అంతర్జాతీయ నిఘా 

ఈ నౌకలో సుమారు 28 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు,  సిబ్బంది ఉన్నారు. వీరిలో  ఇద్దరు భారతీయ సిబ్బంది  కూడా ఉన్నట్లు సమాచారం, అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అమెరికా , బ్రిటన్ ,  స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఇప్పటికే తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక విమానాలను పంపేందుకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 24న సెయింట్ హెలెనాలో దిగిపోయిన 30 మంది ప్రయాణికుల కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 ప్రమాదమేమీ లేదు - WHO భరోసా 

హంటా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇది కోవిడ్-19 లాగా గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరస్ కాదని, కేవలం సన్నిహిత సంబంధాల వల్ల మాత్రమే సోకుతుందని వివరించారు. కానరీ ఐలాండ్స్‌లో దిగిన తర్వాత ప్రతి ప్రయాణీకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అవసరమైన వారికి చికిత్స అందించి, మిగిలిన వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.