Gun Firing In Moscow: రష్యా రాజధాని మాస్కో(Mascow) కాల్పుల మోతతో దద్దరిల్లింది. శుక్రవారం సాయంత్రం నగర శివార్లలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో (Crocus City Concert Hall)కి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మిలటరీ దుస్తుల్లో వచ్చిన సాయుధులు మెషిన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60మందికి పైనే చనిపోయినట్లు... వందమందికిపైగా గాయాలైనట్లు రష్యన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ “ఫిక్‌నిక్” కాన్సర్ట్ మొదలవడానికి ముందు ఈ ఘటన జరిగింది. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.






కాల్పులు- బాంబుదాడులు


సాయంత్రం వరకూ ప్రశాంతంగా మాస్కో..వాయువ్య ప్రాంతం ఒక్కసారిగా భీతావహంగా మారింది. మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఐదుగురు సాయుధులు హలు వద్దుకు వస్తూనే మెషిన్‌గన్లతో కాల్పులు జరిపారని... ఆ తర్వాత హాలులోకి వచ్చి గ్రైనేడ్లను విసిరారని రష్యన్ అధికారిక న్యూస్ ఏజన్సీ RIA NOVOTSI తెలిపింది. ప్రజలు ప్రాణ భయంతో  క్రాకస్ సిటీ హాల్ సమీపంలోని బ్రిడ్జిపై పరిగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. బాంబుల ధాటికి క్రాకస్ హాలు కూడా మంటల్లో చిక్కుకుంది. ఎగిసిపడుతున్న జ్వాలలు, కమ్ముకున్న పొగతో కూడిన వీడియోలు కనిపిస్తున్నాయి.







దాడి జరిగిన వెంటనే రష్యన్ అధికార వర్గాలు సహాయకచర్యలు ప్రారంభించాయి. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు రంగంలోకి దిగి గాయపడ్డ వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నారు. 70 అంబులెన్సులను క్రాకస్ సిటీ హాల్ వద్దకు పంపారు. ఇంకోవైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. మంటల ధాటికి కన్సర్ట్ హాలు పైకప్పు కూలిపోయింది.



ఉగ్రవాదుల దాడితో మాస్కో దద్దరిల్లింది


దాడి మేమే చేశాం- ఐసిస్


మాస్కోలో జరిగిన దాడులకు తామే బాధ్యులమంటూ ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఐసిస్‌కు అనుబంధంగా ఉండే న్యూస్ ఏజన్సీ అమఖ్ తమ టెలిగ్రామ్ చానల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. దాడి తామే చేశామని ISIS ఓ నోట్ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలేవీ వాళ్లు ఇవ్వలేదు. దాడి ఎవరు చేశారనే దానిని రష్యా ఇంతవరకూ అధికారికంగా ధృవీకరించలేదు.






యుక్రెయిన్‌కు సంబంధం లేదు- యుఎస్


రష్యాలో బాంబుల మోత వినగానే అమెరికా వెంటనే స్పందించింది. ఈ దాడితో యుక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని వాళ్లని వెనుకేసుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు బైడెల్ జాతీయ భద్రతా కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ John Kirby  యుక్రెయిన్ ఇందులో పాల్గొన్నట్లుగా తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. యుక్రెయిన్ మిలటరీ వర్గాలు కూడా దీనిపై స్పందించాయి. తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. రష్యా తమపై చేస్తున్న ఆక్రమణకు, దురాగతాలకు ఈ దాడులను రష్యా ఒక సాకుగా వాడుకుంటుందని యుక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది.


ముందే హెచ్చరించిన అమెరికా


మాస్కోలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా తమ పౌరలను ముందే హెచ్చరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాస్కోలో జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు  జరిగే అవకాశం ఉంది... అమెరికన్లు ఎవరూ గుంపులుగా బయటకు పోవద్దనే సందేశాన్ని మర్చి 7న మాస్కోలోని అమెరికన్ ఎంబసీ పంపింది. ఉగ్రవాద దాడుల సమాచారం అమెరికాకు ముందే ఎలా వచ్చిందని రష్యన్ నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దాడి సమాచారాన్ని వెంటనే అధ్యక్షుడికి చేరవేశారు. పుతిన్ ఇంకా దీనిపై స్పందించలేదు. అయితే శుక్రవారం రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ ఏజన్సీ సమావేశంలో మాట్లాడిన పుతిన్ అమెరికా దాడుల విషయంపై తమ పౌరులకు సందేశం  పంపడం రెచ్చగొట్టేవిధంగా ఉందని వ్యాఖ్యానించారు.







26/11 ముంబై దాడి తరహాలోనే


రష్యాలో జరిగిన ఈ దాడి 2008లో ముంబైలో జరిగిన 26/11 గుర్తుకు తెచ్చింది. అప్పుడు కూడా సముద్ర మార్గం ద్వారా వచ్చిన దుండగులు ముంబైలోని తాజ్ హోటల్‌తో, నారీమన్ హౌస్, ట్రైడెంట్ హోటల్, చత్రపతి శివాజీ టెర్మినస్ ప్రాంతాల్లో  విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 166మంది చనిపోగా 300మందికి పైగా గాయపడ్డారు. ఇవాళ దాడిలో ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గడచిన 20 ఏళ్లలో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. 2004లో ఓ స్కూల్లోకి చెచెన్యా సాయుధ బలగాలు చొరబడి వెయ్యిమంది విద్యార్థులను బందీలుగా పట్టుకున్నాయి. ఆప్పుడు జరిగిన కాల్పుల్లో దాదాపు 200మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.