రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Putin ) గురించి.. ఆయనను వ్యతిరేకించే వారిని.. అక్కడి ప్రతిపక్షాలను ఎలా నిర్మూలిస్తాడనే దాని గురించి కథలు కథలుగా బయట ప్రపంచంలో ప్రచారంలో ఉంటాయి.అయితే నిజాలేమిటో మాత్రం ఎప్పటికీ బయటకు రావు. ఇప్పుడు అలాంటిదే.. ప్రపంచం మొత్తం పుతిన్ వైపు అనుమానంగా చూసేలా మరో మర్డర్ కథ బయటకు వచ్చింది.


"పుతిన్ ఓ మానసిక రోగి.. ఆయన రష్యా ఇంటిగ్రిటిని దెబ్బతీస్తున్నారు " అంటూ ఏడాది కిందట అదే దేశానికి చెందిన సూపర్ మోడల్ గ్రెట్టా వెడ్లర్ ( Gretta Vedler ) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిజానికి అప్పట్లో ఉక్రెయిన్‌తో ఎప్పట్లాగే ఉద్రిక్తతలు ఉన్నాయి కానీ యుద్ధం వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. రష్యాలో పరిస్థితుల్ని బట్టే ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే ఆమె అదృశ్యమైపోయింది. ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. మిస్సింగ్ .. మిస్టరీ అలాగే ఉండిపోయింది.


రెండు రోజుల కిందట రష్యాలోని ( Russia ) ఓ ప్రాంతంలో కారులో ఓ పెద్ద సూట్ కేసు బయటపడింది. అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీసి చూస్తే అందులో కనిపించారు.. ఈ సూపర్ మోడల్ గ్రెట్టా వెడ్లర్. అయితే ప్రాణాలతో కాదు. నిర్జీవంగా. హత్యకు గురయ్యారని పోలీసులు నిర్ధారించారు. వెంటనే ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రంగంలోకి వచ్చారు. ఆమెకు తనతో  బ్రేకప్ అయిందని.. కొన్ని విషయాల్లో వాగ్వాదం జరగడంతో పట్టరాని కోపంతో హత్య చేశానని చెప్పారు. దీంతో రష్యా పోలీసులు గ్రెట్టా వెడ్లర్‌ను ప్రియుడే హత్య చేశాడని తేల్చి కేసు క్లోజ్ చేశారు.


కానీ ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. పుతిన్‌పై విమర్శలు చేసిన తర్వాత కిడ్నాపైన ఆమె.. ఏడాది తర్వాత చనిపోయారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారు ? ఆమెను హత్య చేసి చాలా కాలం అవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఆమె మృతేదహాన్ని పాడైపోకుండా జాగ్రత్త చేసి.. ఆమె బతికే ఉందన్న ఓ అభిప్రాయాన్ని కల్పించేందుకు హత్య చేసిన ఆమె ప్రియుడు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు కూడా పెట్టాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కథ చాలా అసహజంగా ఉందని.. అతికినట్లుగా లేదన్న అభిప్రాయం ఎవరికైనా వస్తుంది. కానీ రష్యాలో ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే..అనుమానాలకు నివృతి కావాలా... ప్రాణం కావాలా అనే రెండు ఆప్షన్లు మాత్రమే అక్కడ ఉంటాయి.