Former British Prince Andrew arrested :  బ్రిటన్ లో ఎప్ స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. బ్రిటన్ రాజకుటుంబంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించేలా, కింగ్ చార్లెస్ తమ్ముడు, మాజీ యువరాజు ఆండ్రూను లండన్ పోలీసులు  గురువారం  నాడు అరెస్టు చేశారు. అమెరికా ఆర్థికవేత్త, శిక్ష పడిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలపై వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాలతో ఈ చర్య తీసుకున్నారు.

ఆండ్రూపై ప్రధాన ఆరోపణలు ఏమిటి? 

ఇటీవల అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన సుమారు 35 లక్షల పేజీల  ఎప్ స్టీన్ ఫైల్స్ ఆధారంగా ఆండ్రూపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.  2001 నుండి 2011 వరకు బ్రిటన్ వాణిజ్య రాయబారిగా పనిచేసిన సమయంలో, ఆండ్రూ అధికారిక పర్యటనలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని, వాణిజ్య నివేదికలను ఎప్స్టీన్‌కు చేరవేసినట్లు ఈ ఫైల్స్ ద్వారా బయటపడింది.  అధికారిక హోదాలో ఉండి తన స్నేహితుడైన ఎప్ స్టీన్ వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేశారని, ఇది  మిస్‌కండక్ట్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ కిందకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఎప్ స్టీన్  పరిచయం చేసిన  మహిళలతో ఆండ్రూకు సంబంధం ఉందనే పాత ఆరోపణలకు తోడు, ఇప్పుడు కొన్ని వివాదాస్పద ఫోటోలు కూడా బయటపడ్డాయి.               

 రాజకుటుంబం స్పందన 

 అక్టోబర్ 2025లోనే కింగ్ చార్లెస్ తన సోదరుడిపై ఉన్న అన్ని గౌరవ బిరుదులను, ప్రిన్స్ హోదాను తొలగించారు. తాజా పరిణామాలపై బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందిస్తూ..  చట్టం ఎవరికీ చుట్టం కాదని, పోలీసు దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని  స్పష్టం చేసింది. తన సోదరుడి వ్యవహారం పట్ల కింగ్ చార్లెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

ముందుకు సాగుతున్న దర్యాప్తు 

థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రిటన్ అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. చట్టానికి ఎవరూ అతీతులు కారు  అని బ్రిటన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం పేర్కొంది.

ఈ అరెస్టు బ్రిటన్ రాజకుటుంబ చరిత్రలోనే ఒక అత్యంత అవమానకరమైన ఘట్టంగా మిగిలిపోనుంది. ఎప్ స్టీన్ నెట్‌వర్క్‌లో చిక్కుకున్న ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఈ ఫైల్స్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.