OpenAI Altman Anthropic Amodei at Delhi Summit:ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ ఒకే వేదికను పంచుకోవడం ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే వీరిద్దరూ ఇలా వేదికను పంచుకోవడం మాత్రమే కాదు.. వారు ఇద్దరూ చేతులు కలపాల్సిన సందర్భం వస్తే .. పట్టించుకోలేదు. ఇది వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన పోటీ, గతానుభవాల దృష్ట్యా ఆ వేదికపై ఒక విధమైన ఇబ్బందికర వాతావరణం నెలకొంది. కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
ఆంత్రోపిక్ వ్యవస్థాపకుడైన డారియో అమోడెయ్ గతంలో ఓపెన్ ఏఐలోనే కీలక బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన అక్కడ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అయితే, ఓపెన్ ఏఐ పనితీరు, భద్రతా ప్రమాణాలు, ఆ సంస్థ కమర్షియలైజేషన్ వైపు వెళ్తున్న తీరుపై డారియోకు సామ్ ఆల్ట్‌మాన్‌తో విభేదాలు వచ్చాయి. ఏఐ వ్యవస్థల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన 2021లో ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చి, తన సోదరి గూడెన్ అమోడెయ్‌తో కలిసి ఆంత్రోపిక్ ను స్థాపించారు.
ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ నుంచి ఓపెన్ ఏఐ భారీ పెట్టుబడులను స్వీకరించడం డారియోకు నచ్చలేదని టెక్ వర్గాలు చెబుతుంటాయి. లాభాపేక్ష లేని సంస్థగా మొదలైన ఓపెన్ ఏఐ, లాభాల బాట పట్టడం వల్ల ఏఐ భద్రత విషయంలో రాజీ పడుతుందేమోనన్నది ఆయన ఆందోళన. అందుకే ఆంత్రోపిక్ సంస్థను ఒక పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్ది, క్లాడ్ వంటి సురక్షితమైన ఏఐ మోడళ్లను రూపొందించడంపై ఆయన దృష్టి పెట్టారు.
ఢిల్లీ సదస్సులో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య మునుపటి సాన్నిహిత్యం కనిపించలేదు. పరస్పరం పలకరించుకోలేదు. అందరూ చేతులు కలిపి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలోనూ వారు చేతులు పైకి ఎత్తారు కానీ.. ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేయలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్ అయిన చాట్ జీపీటీ, క్లాడ్ మధ్య జరుగుతున్న పోటీ, ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న కోల్డ్ వార్ కు ప్రతిరూపంగా నిలుస్తోంది. సాధారణంగా టెక్ రంగంలో ఇలాంటి పోటీ సహజమే అయినప్పటికీ, ఒకే మూలాలు ఉన్న ఈ ఇద్దరు నేతలు రెండు వేర్వేరు ధృవాలుగా మారడం ఏఐ భవిష్యత్తుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.