Flight Dropped: అమెరికాలో ఓ విమానంలో ప్రయాణికులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వారు ప్రయాణిస్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం 10 నిమిషాల్లో 28 వేల అడుగుల కిందకు వేగంగా దిగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తడంతో విమానాన్ని వేగంగా కిందకు దించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. 


యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన ప్రయాణికులకు ఈ అనుభవం ఎదురైంది. ఫ్లైట్ 510 బుధవారం నెవార్క్ నుంచి రోమ్ కి బయలుదేరింది. అయితే క్యాబిన్ ప్రెజర్ తో సమస్య ఎదురైంది. బోయింగ్ 777 విమానంలో 270 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారని యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. మౌయి లోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య తలెత్తడంతో కేవలం 10 నిమిషాల్లో 28 వేల అడుగుల కిందకు దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూజెర్సీకి తిరిగి వెళ్లింది. రాత్రి 8.37 గంటలకు టేకాఫ్ అయి.. 12.27 గంటలకు తిరిగి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 


సమస్య తలెత్తినప్పటికీ.. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. విమానంలో పీడన సమస్య తలెత్తడంతోనే విమానం 10 నిమిషాల్లో 28 వేల అడుగుల కిందకు రావాల్సి వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. ప్రయాణికులకు మరో విమానంలో వారి గమ్యస్థానానికి పంపించినట్లు యునైటెడ్ ఎయిర్ లైన్స్ తెలిపింది.


గత నెలలోనూ ఇదే తరహా ఘటన


అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానం 3 నిమిషాల్లో 15 వేల అడుగుల కిందకు దిగింది. విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తడం వల్లే ఇలా జరిగిందని అమెరికన్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ఫ్లైట్ 5916 ఉత్తర కరోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్ విల్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. విమానంలో పీడన సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే మాస్కుల ద్వారా ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందకి దించి, తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించినట్లు పైలట్లు తెలిపారు. దీంతో విమానాన్ని కేవలం 6 నిమిషాల్లో 18,600 అడుగుల కిందకి దించినట్లు ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ పేర్కొంది.


ఆ విమానంలో ప్రయాణించిన ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హారిసన్ హోవ్ తను ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. చాలాసార్లు నేను విమానంలో ప్రయాణించాను. కానీ, ఇది భయానక అనుభవం ఎప్పుడూ చూడలేదు అని ట్విట్టర్ పోస్టులో తెలిపారు. మండుతున్న వాసన, చెవులు భరించలేని శబ్దం రావడంతో ఆందోళన పడ్డట్లు చెప్పారు. ఫోటోలను కూడా తీసే సమయం లేదని తెలిపారు. ఆయన షేర్ చేసిన ఫోటోల్లో హోవ్ సహా ప్రయాణికులు అందరూ ఆక్సిజన్ మాస్క్ ల సహాయంతో ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.