FATF Russia Membership: FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ భద్రత, సమగ్రతకు రష్యన్ ఫెడరేషన్ చర్యలు ఆమోదయోగ్యంగా లేవని FATF తెలిపింది. ఈ మేరకు రష్యా సభ్యత్వాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు FATF ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధం కొనసాగించడం ఎఫ్ఏటీఎఫ్ సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) శుక్రవారం రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది.






సస్పెండ్ చేసినప్పటికీ మెంబర్ గా కొనసాగింపు


"రష్యన్ ఫెడరేషన్ చర్యలు భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన FATF ప్రధాన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి" అని ప్యారిస్ ఆధారిత గ్రూప్ ఎఫ్ఏటీఎఫ్  ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత ఏడాది ఉక్రెయిన్ పలుమార్లు కోరింది.  రష్యా ఇప్పుడు సస్పెండ్ అయినప్పటికీ సభ్యదేశంగా ఉంటుంది. "FATF ప్రమాణాలను అమలు చేయడానికి రష్యన్ ఫెడరేషన్ బాధ్యత వహిస్తుంది. రష్యన్ ఫెడరేషన్ తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కొనసాగించాలి" అని FATF పేర్కొంది. ప్రతి ప్లీనరీ సమావేశాల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపింది. FATF అనేది అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడం, దేశాలు వాటిని గౌరవిస్తున్నాయో లేదో తనిఖీ చేయడం ద్వారా మనీలాండరింగ్  టెర్రరిజం ఫైనాన్సింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.


రష్యా ఇప్పటికీ జవాబుదారి


FATF ప్రమాణాలను అమలు చేయడంలో రష్యా ఇప్పటికీ జవాబుదారీగా ఉందని పేర్కొంది. ప్యారిస్‌లో ఐదు రోజుల సమావేశం తరువాత, FATF నైజీరియా, దక్షిణాఫ్రికాలను తన పర్యవేక్షణకు లోబడి ఉన్న దేశాల జాబితాలో చేర్చింది.  కంబోడియా, మొరాకోలను పర్యవేక్షణ కేటగిరి నుంచి తొలగించింది. కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఇప్పటికే రష్యాను  బహిష్కరించింది.  UN మానవ హక్కుల మండలి నుంచి కూడా రష్యాను సస్పెండ్ చేశారు. అయినా రష్యా ఇప్పటికీ అనేక అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది
 
రష్యాను సస్పెండ్ చేయాలనే నిర్ణయాన్ని ఉక్రెయిన్ స్వాగతించింది. అయితే రష్యాను బ్లాక్‌లిస్ట్ లో యాడ్ చేయడానికి FATF సభ్యులపై ఒత్తిడి తీసుకోస్తామని ఉక్రెయిన్ పేర్కొంది. " సభ్యత్వం రద్దు చేస్తే సరిపోదు, కానీ ఇది సరైన దిశలో ఒక ముఖ్యమైన అడుగు" అని ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి సెర్గీ మార్చెంకో అన్నారు. రష్యాను సంస్థ నుంచి తొలగించాలని ఉక్రెయిన్ పదేపదే కోరుతుంది.  ఎందుకంటే మాస్కోపై ఒత్తిడి తీసుకురావడానికి అంతర్జాతీయ, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ల ద్వారా ఉక్రెయిన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నేటికి ఏడాది అయింది.