ప్రపంచ కుబేరుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) ఎలాంటి ఇంటిలో నివసిస్తారో తెలుసా? విశాలమైన భవంతిలోనే  అయి ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే! ఆయన నివాసం గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారంటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే. ఎలన్ మస్క్ అద్దె ఇంటిలోనే నివసిస్తున్నారు. 50 వేల డాలర్ల అద్దె చెల్లించి మరీ ఆయన ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 







అది ఇది కాదు..
ఎలన్ మస్క్‌ నికర సంపద దాదాపు 185 బిలియన్ డాలర్లుగా (దాదాపు 13.75 లక్షల కోట్లు) ఉంది. ప్రస్తుతం ఆయన టెక్సాస్ నగరంలోని బోకచికాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బాక్సాబెల్ కాసిస్టా అనే హౌసింగ్ స్టారప్ ఓ ఇంటికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. టెస్లాకు సంబంధించిన వార్తలను ప్రచురించే మీడియా కంపెనీ టెస్లారతి (Teslarati) ఈ వీడియోను షేర్ చేసింది. 'ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరై ఉండవచ్చు. కానీ ఆయన ఇలాంటి ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు' అని పేర్కొంది. టెస్లారతి ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. 'నేను నివసించే ఇంటికి 50000 డాలర్ల అద్దె చెల్లిస్తున్నాను. కానీ అది ఇది కాదు' అని రిప్లై ఇచ్చారు. 
టాప్ సీక్రెట్ కస్టమర్ కోసం..
బాక్సాబెల్ (Boxabl) కంపెనీ లాస్ వేగాస్‌లో ఉంది. తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో భవనాలను నిర్మించడమే లక్ష్యంగా ఇది ఏర్పడింది. పెట్టె వంటి వాటిలో ఇళ్లను నిర్మిస్తుంది. కేవలం ఒక రోజులోనే వీటిని ఏర్పాటు చేస్తుంది. బోకచాకాలో నిర్మిస్తున్న ఓ భవంతికి సంబంధించిన వీడియోను నవంబర్ నెలలో షేర్ చేసింది. దీనిని పేరు తెలియని ఇష్టపడని ప్రముఖ కస్టమర్ (టాప్ సీక్రెట్ కస్టమర్) కోసం నిర్మిస్తున్నామని చెప్పింది. ఈ ఇంటి తలుపుపై ఫాల్కోన్ 9 (Falcon 9) పోస్టర్ ఉంది. ఫాల్కోన్ 9 అనేది మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థలో ఉపయోగించే రాకెట్లలో ఒకటి. దీంతో ఇది మస్క్ కోసమే నిర్మిస్తున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. బాక్సాబెల్ షేర్ చేసిన వీడియోలో ఉన్న ఇంటిని 375 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో కిచెన్, బెడ్ రూమ్, బాత్ రూమ్ ఉన్నాయి. దీని అద్దె 49,500 డాలర్లని బాక్సాబెల్ పేర్కొంది. 
ఎలన్ మస్క్ తన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అంగారకుడిపై నివాసం, సొరంగ మార్గంలో ప్రయాణం, స్టార్ లింక్ .. మస్క్ ఏం చేసినా సంచలనమే. ప్రపంచానికి సంబంధించిన కొన్ని రంగాలను పూర్తిగా మార్చేసేలా అతను ఆవిష్కరణలను తీసుకొస్తుంటారు. బిట్‌కాయిన్‌తో ప్రపంచాన్ని శాసించాలన్నా.. కోతితో వీడియోగేమ్ ఆడించాలన్నా ఆయనకే చెల్లింది. ఆయన ట్వీట్ల కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది.