New Twitter CEO: ట్విట్టర్ పూర్తిస్థాయిలో తన చేతికి రాగానే మాస్టార్ ప్లాన్ వేయాలని ఎలాన్ మస్క్ ఉన్నట్లు సమాచారం. ఫ్రీ స్పీచ్‌కు అడ్డు పడుతున్నారంటూ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ్ గద్దెలను తప్పించాలనే ఆలోచనలో మస్క్ ఉన్నట్లు
తెలుస్తోంది. అసలు మస్క్ ప్లాన్ ఏంటీ? వీళ్లని తప్పించటం అంత తేలికా?


ఏం చేస్తారు?


ట్విట్టర్ పూర్తిస్థాయిలో తన చేతుల్లోకి రాకముందే వివాదాలు మొదలుపెట్టేశాడు ఎలాన్ మస్క్. ప్రధానంగా ట్విట్టర్ నిర్వాహక బృందంపై ఆయన దృష్టి సారించాడు. సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దెపై మస్క్ పూర్తిస్థాయి అసంతృప్తితో ఉన్నట్లు రాయిటర్స్ ప్రచురించింది.

ఎలన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిన వెంటనే...బోర్డ్ మీటింగ్‌లో విజయగద్దె, పరాగ్ ఇద్దరూ చాలా ఆందోళన చెందినట్లు వార్తలొచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మస్క్‌కు స్వాగతం పలుకుతున్నట్లు పరాగ్ ట్విట్టర్‌లోనే స్పందించారు. మస్క్ మాత్రం తను చేయాలనుకున్నది చేస్తున్నారు. ట్విట్టర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె ఫోటోలతో నేరుగా ట్వీట్లు వేసి విమర్శల పాలయ్యారు ఎలాన్ మస్క్.


సీఈఓ మార్పు

ఇప్పుడు కూడా విజయ గద్దెను సాగనంపటానికి పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు పరాగ్ అగర్వాల్‌ను తప్పించేందుకు మరో వ్యక్తిని ఇప్పటికే ఎలన్ మస్క్ దృష్టిలో పెట్టుకున్నట్లు రాయిటర్స్ ప్రచురించింది. కొత్త సీఈఓగా తీసుకోవాలని ఎలన్ మస్క్ దృష్టిలో ఎవరున్నారో బయటకు రాకపోయినా జరగబోయే పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై మస్క్ స్పష్టతతో ఉన్నారని సమాచారం.


అంత సులభమా?


కానీ ఇది అంత సులభం కాకపోవచ్చు. ఎందుకుంటే గతేడాది నవంబర్‌లోనే పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఈ పదవి ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే చేతుల్లోనే ఉండేది. కనుక ఇంకా పరాగ్ వచ్చి సంవత్సరం పూర్తికాకపోవటంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే  లీగల్‌గా మస్క్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


మొదటిది పరాగ్ జీతం.. ఒకవేళ పరాగ్‌ను సీఈఓగా తప్పించాలని మస్క్ భావిస్తే అందుకు ప్రతిఫలంగా 43 మిలియన్ డాలర్లను ఎలాన్ మస్క్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.350 కోట్లు. అంతే కాకుండా పరాగ్ అగర్వాల్‌కు ట్విట్టర్‌తో 12 నెలల ఒప్పందం ఉంది. ఇంకా పరాగ్‌కు ట్విట్టర్‌లో షేర్లు వాటిలో వాటాలున్నాయి. విజయ గద్దెను సాగనంపాలన్నా సరే మస్క్‌కు ఇబ్బంది ఉంది.


విజయగద్దెకు ఏడాదికి 12.5 మిలియన్ డాలర్లు అందుతుండగా కంపెనీలో వాటాలు సైతం ఉన్నాయి. మొత్తం మీద ఆమెకు ఏడాదికి 17 మిలియన్ డాలర్లు అందుతున్నాయి. ట్విట్టర్‌లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగుల్లో ఆమె ఒకరు. ఇప్పుడు మస్క్ కు తనకు నచ్చలేదని ఇద్దరినీ తొలగించాలంటే దాదాపు 1000 కోట్ల రూపాయల దాకా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది.

కంపెనీలో మిగిలిన ఉద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొంది. జాబ్ సెక్యూరిటీ విషయంలో ఉద్యోగులు భయాందోళనలకు లోనవుతున్నారు. చూడాలి మరి ఎలన్ మస్క్ ఏం చేస్తాడో.