Eiffel Tower Closed: ఈఫిల్ ట‌వ‌ర్‌(Eiffel Tower).. ప్ర‌పంచ ప‌ర్యాట‌క జాబితాలో చోటు ద‌క్కించుకున్న అద్భుత‌మైన క‌ట్ట‌డం. దీనిని సంద‌ర్శించేందుకు ప్ర‌తి  రోజూ విదేశీ ప‌ర్యాట‌కులు(Internationa Tourists) క్యూ క‌డ‌తారు. దీంతో ఏడాది పొడ‌వునా.. ఈ టవ‌ర్‌ను సంద‌ర్శించేందుకు అనుమ‌తి ఉంది. ఈ ట‌వ‌ర్ కార‌ణంగా స్థానికంగా ఇత‌ర వ్యాపారాలు కూడా వృద్ధి చెందాయి. అనేక మందికి ఉపాధి కూడా ల‌భించింది. అయితే, ఇప్పుడు ఈఫిల్ ట‌వ‌ర్ అక‌స్మాత్తుగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. దీనిని మూసివేయ‌డ‌మే దీనికి కార‌ణం. అదేంటి? అనుకుంటున్నారా?  ఈఫిల్ ట‌వ‌ర్స్‌లో ప‌నిచేసే ఉద్యోగులు(Employees) త‌మ వేత‌నాలు(Sallaries) పెంచాల‌ని.. ట‌వ‌ర్ నిర్వ‌హ‌ణ‌ను మ‌రింత మెరుగు ప‌ర‌చాల‌ని డిమాండ్ చేస్తూ సోమ‌వారం మెరుపు స‌మ్మెకు దిగారు. దీంతో ట‌వ‌ర్‌ను మూసివేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఉద్యోగుల‌కు న‌చ్చ‌జెప్పినా వారు దిగిరాక‌పోవంతో ట‌వ‌ర్ నిర్వాహ‌కులు “సమ్మె కారణంగా, ఈఫిల్ టవర్ మూసివేయబడింది. మేము క్షమాపణ చెపుతున్నాం`` అని ట‌వ‌ర్ ముందు బోర్డు వేలాడ‌దీశారు. దీంతో వంద‌లాది మంది ప‌ర్యాట‌కులు నిరాస‌తో వెనుదిరిగారు. 


ఏం జ‌రిగింది?


సెంట్రల్ ప్యారిస్‌(Paris)లోని అత్యంత ప్రజాదరణ పొందిన 330-మీటర్ల(1083-అడుగులు) పొడ‌వైన ఈఫిల్ ట‌వ‌ర్ ప్ర‌పంచ అద్భుతాల్లో ఒక‌టిగా నిలిచింది. దీనిని ద‌ర్శించుకునేందుకు, విశేషాలు తెలుసుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్యాట‌కులు ఇక్క‌డ‌కు వ‌స్తుంటారు. ఇక‌, త్వ‌ర‌లోనే ఇక్క‌డ‌ వేసవి ఒలింపిక్స్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌ర్యాట‌కుల సంద‌డి మ‌రింత పెరిగింది. అయితే.. సోమవారం ఈఫిల్ టవర్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్న పర్యాటకులు దాని వెబ్‌సైట్‌లో పెట్టిన స‌మాచారంతో నివ్వెర‌పోయారు.  ఈఫిల్ ట‌వ‌ర్ సందర్శన‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డ‌బ్బులు వెన‌క్కి ఇస్తామ‌ని కూడా పేర్కొన్నారు. రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఈఫిల్ టవర్ సందర్శనలకు అంతరాయం కలుగుతుందని ల్యాండ్‌మార్క్ ఆపరేటర్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. "మేము నిరాశకు గురయ్యాం. ఉద్యోగుల స‌మ‌స్య‌ల కార‌ణంగా వారు స‌మ్మెకు దిగ‌డంతో ట‌వ‌ర్ సంద‌ర్శ‌న‌ల‌ను నిలిపివేయాల్సి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ఉద్యోగుల డిమాండ్ల‌ను కూడా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం`` అని నిర్వాహ‌కులు పేర్కొన్నారు.  


రెండు మాసాలుగా .. 


ఈఫిల్ టవర్ సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు(365 Days) తెరిచి ఉంటుంది. ప్ర‌పంచ ప‌ర్యాట‌క క‌ట్ట‌డాల్లో ఇది ప్ర‌ముఖంగా ఉంది. దీంతో విదేశీ ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువ‌. అయితే.. ఉద్యోగులు త‌మ వ‌తేనాలు పెంచాల‌ని చేస్తున్న డిమాండ్‌, సమ్మెల కారణంగా రెండు నెలల్లో రెండు సార్లు ట‌వ‌ర్‌ను మూసివేశారు. డిసెంబరులో ఉద్యోగులు తొలుత త‌మ డిమాండ్లు వినిపించారు. ఈఫిల్ ట‌వ‌ర్ కు ఆదాయంపెరిగింద‌ని, కానీ, త‌మ వేత‌నాలు మాత్రం పెంచ‌డం లేద‌ని వారు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో త‌మ వేత‌నాలు కూడా పెంచాల‌ని సూచిస్తున్నారు. త‌ర‌చుగా మ‌ర‌మ్మ‌లకు గుర‌వుతోంద‌ని. కాబట్టి నిర్వ‌హ‌ణ‌ను కూడా మెరుగు ప‌ర‌చాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చలు జ‌రిగినా..ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తొలిసారి  క్రిస్మస్ రోజు మొత్తం ట‌వ‌ర్‌ను మూసివేశారు. 


ఉద్యోగుల మాట ఇదీ..


ఈఫిల్ టవర్ లో ప‌నిచేసే ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న CGT యూనియన్‌కు చెందిన స్టెఫాన్ డైయు మాట్లాడుతూ, ప్యారిస్ మునిసిపాలిటీ యాజమాన్యంలో ఉన్న ట‌వ‌ర్‌ను మెరుగుపరచడం, టిక్కెట్ విక్రయాల నుండి వచ్చే ఆదాయానికి అనుగుణంగా జీతం పెరుగుదలను లక్ష్యంగా చేసుకుని సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనియన్ నాయకులు ఈఫిల్ టవర్  వ్యాపార నమూనాను విమర్శించారు,  భవిష్యత్ సందర్శకుల సంఖ్య, నిర్వహణ  వంటివి ఉద్యోగుల వేత‌న పెంపుపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. "స్మారక చిహ్నం దీర్ఘకాలిక పరిరక్షణ, మేము పనిచేస్తున్న సంస్థ  శ్రేయస్సుపై స్వల్పకాలిక ప్రయోజనాలకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగులు ఏమైనా ఫ‌ర్వాలేదు.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే స‌మ్మెకు దిగాం`` అని డైయు పేర్కొన్నారు.