Ukraine War | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌పై తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల భేటీ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ కండిషన్స్ కు ఓకే చేయకపోవడంపై ట్రంప్ సీరియస్ గా ఉన్నారు. ఎలాగైనా ఉక్రెయిన్‌ను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఆ దేశానికి అందిస్తున్న మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. కీవ్ నుంచి అమెరికా సేనల్ని వెనక్కి రప్పిస్తోంది. ఈ వైట్ హౌస్ ఈ విషయాన్ని వెల్లడించింది.
యుద్ధంలో సహకరించాలని పట్టుబట్టిన జెలెన్ స్కీ
కీవ్ లో ఖనిజాల మైనింగ్ కు అనుమతిపై ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్ అధినేతను డోనాల్డ్ ట్రంప్ కోరారు. అయితే రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు కచ్చితంగా సైనిక సాయం అందిస్తామని, భవిష్యత్తులో దురాక్రమణ చేస్తే అమెరికా రంగంలోకి దిగేందుకు అగ్రిమెంట్ చేసుకోవాలని జెలెన్ స్కీ పట్టుపట్టారు. గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు తమకు ఇలా నోటి మాట చెప్పారని, సరైన సమయంలో వారి నుంచి సైనిక, ఇతర సాయం లభిస్తుందోనని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ఓ దశలో డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఉక్రెయిన్ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు అంత సాయం చేస్తున్న తమతో ఆ దేశ అధినేత జెలెన్ స్కీ వ్యవహరిస్తున్న తీరు సరికాదు అంటూ ట్రంప్ మండపడ్డారు.
ఓవల్ ఆఫీసులో ట్రంప్, జెలెన్ స్కీ వాగ్వివాదం..
ఇటీవల అమెరికాకు వచ్చిన సమయంలో ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ తో చర్చలు జరిపినా ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జెలెన్ స్కీ వెళ్ళిపోయారు. శాంతి స్థాపనకు ఉక్రెయిన్ అధినేత సిద్ధంగా లేరంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రజల ప్రాణాలను జెలెన్ స్కీ రిస్క్ లో పెడుతున్నారని, మూడో ప్రపంచ యుద్ధానికి ఆహ్వానం పలుకుతున్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా తిరిగొచ్చేసిన ఉక్రెయిన్ అధినేతకు యూకే, కెనడా మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ కు సైనిక సహాయాన్ని నిలిపివేస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిస్థాపనకు ట్రంప్ సిద్ధంగా ఉన్నా, ఉక్రెయిన్ మా లక్ష్యానికి కట్టుబడి ఉండాలి. అలా కాని పక్షంలో ఉక్రెయిన్ నుంచి మిలటరీ సాయాన్ని ఉపసంహరించుకున్నామని వైట్ హౌస్ లో పనిచేసే ఓ అధికారి స్పష్టం చేశారు.
అసలే టారిఫ్ ల వార్ మొదలుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ మీద పడ్డారు. నెక్ట్స్ టార్గెట్ యూరప్ దేశాలేనని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనతో చర్చలు విఫలం అయ్యాక యూరప్ దేశాల అధినేతలతో జెలెన్ స్కీ భేటీ కావడంతో ట్రంప్ బిగ్ బాంగ్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. యూరప్ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టి, వారిని సైతం ఇరకాటంలో పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జెలెన్ స్కీ అమెరికాతో ఖనిజాల తవ్వకంపై ఒప్పందం చేసుకోని పక్షంలో త్వరలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.