వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా మరింత ఒత్తిడిని పెంచనుంది. ఆదివారం ఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలితేనే పుతిన్‌ను రౌండ్ టేబుల్ చర్చలకు తీసుకురావచ్చని అన్నారు. - అదనపు ఆంక్షలు, చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండోసారి సుంకాలు విధించడం ద్వారా రష్యాను కట్టడి చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.
వార్తా సంస్థ ANI ప్రకారం, మరింత కఠినమైన చర్యలు, ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు, "అవును, నేను సిద్ధంగా ఉన్నాను..." అని డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు.
అంతకుముందు, ఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెస్సెంట్ మాట్లాడుతూ.. "ఉక్రేనియా సైన్యం ఎంతకాలం అని రష్యాను తట్టుకుంటుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం మనుగడ సాగిస్తుంది అనే దాని మధ్య పోటీ నెలకొంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించాలని భావిస్తుంది. తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. అది పుతిన్‌ను చర్చలకు వచ్చేలా చేస్తుంది" అని అన్నారు.
రష్యా ముడి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి భారతదేశం. ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహితంగా మాట్లాడినప్పటికీ, టారిఫ్ మీద వెనక్కి తగ్గడం లేదు. వాషింగ్టన్ ఇప్పటికే మాస్కోతో ఉన్న ఇంధన సంబంధాల కారణంగా భారత్ మీద భారీ సుంకాలు విధించింది. సుంకాలు పెంచుతాం, రెండో దశ ఆంక్షలు విధిస్తే యూరోపియన్ యూనియన్ కలిసి రావాలని ట్రంప్ కోరారు.
కీవ్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలపై రష్యా దాడి
రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారీ వైమానిక దాడి జరిగింది. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం, ఆదివారం రష్యా 810 డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. అధికారులు 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను అడ్డుకున్నామని చెప్పారు. అయినప్పటికీ రష్యా దాడులు విధ్వంసానికి కారణమయ్యాయని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
కీవ్‌లోని సెంట్రల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ భవనంపై దాడి జరగడంతో దట్టమైన పొగలు వచ్చాయి అని AP నివేదించింది. ఫిబ్రవరి 2022 తర్వాత రాజధాని కీవ్ లోని ప్రభుత్వ భవనంపై నేరుగా దాడి చేయడం ఇదే మొదటిసారి. నలుగురు మరణించారని, 44 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు. తాను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో దాడుల గురించి మాట్లాడానని తెలిపారు. "ఫ్రాన్స్‌తో కలిసి, మేం మా రక్షణను బలోపేతం చేసుకునేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నాం" అని జెలెన్స్కీ AP ద్వారా తెలిపారు.
"విచక్షణారహితంగా దాడి చేస్తోంది" అని మాక్రాన్ రష్యా మీద మండిపడ్డారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా రష్యా దాడిని ఖండించారు. పుతిన్ శాంతి గురించి సీరియస్‌గా లేడు. ఇప్పుడు ఉక్రెయిన్, దాని సార్వభౌమత్వానికి మన మద్దతును కొనసాగించాలి అని స్టార్మర్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్ల దాడిలో నగరంలోని నివాస భవనాలపై దాడి చేయడంతో ఒక తల్లి, ఆమె మూడు నెలల చిన్నారి మరణించారని కీవ్ అధికారులు నివేదించారు.
దాడిని ఖండించిన జెలెన్ స్కీ
రాజధాని కీవ్‌లో ప్రభుత్వ ఆఫీసులపై రష్యా దాడులను జెలన్ స్కీ తీవ్రంగా ఖండించారు, "నిజమైన దౌత్యం ఎప్పుడో ప్రారంభం కావాలి, ఇది రష్యా ఉద్దేశపూర్వక నేరం. ప్రపంచం క్రెమ్లిన్ నేరస్థులను హత్యలు ఆపాలని బలవంతం చేయగలదు అన్నారు. దాడి ప్రారంభమైనప్పటి నుండి, రష్యన్లు మొదటిసారిగా కీవ్ లోని మా ప్రభుత్వ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు" అని ఉక్రెయిన్ ప్రధాన మంత్రి యులియా స్విరిడెంకో అన్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడానికి సహాయం చేయాలని కోరారు.
రష్యా సైనిక లక్ష్యాలను పేర్కొంది
కేవలం డ్రోన్ అసెంబ్లీ సైట్‌లు, వైమానిక స్థావరాలు, ఇతర సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశాయని, కీవ్ ప్రభుత్వ భవనాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ప్రాంతాలు, క్రిమియా, అజోవ్ సముద్రంలో 100 ఉక్రేనియన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు మాస్కో తెలిపింది. . క్రాస్నోడార్‌లోని స్థానిక అధికారులు పడిపోయిన శిధిలాలు చమురు శుద్ధి కర్మాగారంలో ప్రమాదానికి కారణమయ్యాయని చెప్పారు.