Israeli Hostage Breaks Down Inside Hamas Tunnel | హమాస్ చాలా మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుంది. తాజాగా హమాస్ గ్రూప్ విడుదల చేసిన ఓ వీడియో గుండెల్ని పిండేస్తోంది. ఆ వీడియోలో గమనిస్తే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ బందీ తన సమాధిని తానే తవ్వుతూ కనిపించాడు. తవ్వుతున్నది తన సమాధి అని, తన అంత్యక్రియలు అక్కడే జరుగుతాయని సైతం అతడు చెప్పడం నెటిజన్లను కదిలిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎముకల గూడుగా మారుతున్న శరీరం..
పాలస్తీనా సంస్థ హమాస్ విడుదల చేసిన 24 ఏళ్ల ఎవ్యాతర్ డేవిడ్ కు సంబంధించిన రెండవ వీడియో ఇది. వీడియోలో డేవిడ్ చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. శరీరం ఎముకల గూడుగా మారుతోంది. అతడు ఆ గుహలో చాలా కష్టంగా మాట్లాడుతున్నాడు. హమాస్ విడుదల చేసిన వీడియోలో, అతను ఒక మూసి ఉన్న భూగర్భ సొరంగంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను కెమెరా వైపు దీనంగా చూస్తూ నెమ్మదిగా మాట్లాడుతూ తన బాధను వివరిస్తున్నాడు.
'నేను నా సమాధిలోకి వెళ్తున్నాను'
డేవిడ్ హీబ్రూ భాషలో ఇలా అన్నాడు, "నేను ఇప్పుడు నా సమాధిని తవ్వుకుంటున్నాను. రోజురోజుకూ నా శరీరం మరింత బలహీనంగా మారుతోంది. నేను చావును సమీపిస్తున్నాను. అంటే క్రమంగా నా సమాధికి దగ్గరవుతున్నాను. వెళ్తున్నాను. నన్ను ఖననం చేసేది ఇక్కడే. స్వేచ్ఛ పొందే సమయం మించిపోయింది. మరోసారి నా కుటుంబంతో కలిసి గడిపే రోజులు గడిచిపోయాయి" అని ఎంతో బాధగా చెప్పిన యువకుడు అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటాడు. తాను అక్కడి నుంచి బయటపడే అవకాశమే లేదని, తాను తవ్వుకుంటున్న సమాధిలోనే తన అంత్యక్రియలు చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నాడు.
ఎవ్యాతర్ డేవిడ్ కుటుంబం ఆ వీడియోను విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. ఒక ప్రకటనలో వారు ఇలా మాట్లాడారు. "ప్రచారం కోసం మా కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే ఆకలితో ఉంచడం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన సంఘటనలలో ఒకటి. అతను కేవలం హమాస్ ప్రచారం కోసం తిండి లేకుండా ఆకలితో ఉండేలా చేశారు" హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ ప్రజలను బందీలుగా చేసుకుని చిత్రహింసలు పెడుతోంది అనడానికి ఈ వీడియోనే నిదర్శనం.
బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారు?
వీడియో విడుదలైన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ చేతిలో బందీగా ఉన్న తమ పౌరుడు డేవిడ్ కుటుంబంతో మాట్లాడారు. ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారని, త్వరలోనే బందీలను విడిపించేందుకు ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చర్యలు తీసుకుంటున్నారని పీఎంఓ కార్యాలయం తెలిపింది. బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. బందీలను కావాలనే ఆకలితో ఉంచి, వారిపై దుర్మార్గంగా వ్యవహరించడాన్ని నెతన్యాహు తీవ్రంగా కండించారు. ఇజ్రాయెల్ బందీలపై హమాస్ ప్రవర్తిస్తున్న సరికాదని, ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు.