UK Cornwall Council: యూకేలో ఇల్లు కొనాలన్నా, అద్దెకు ఉండాలన్నా గగనం అయిపోయింది. గృహాలు ఓ సంక్షోభంగా మారాయి. ముఖ్యంగా లండన్, సౌత్ ఈస్ట్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇంటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అద్దె ధరలు కూడా చుక్కల్ని చూపిస్తున్నాయి. ఇల్లు కొనాలంటే కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. పోనీ అద్దెకు ఉందామంటే.. సంపాదనలో సగం అటే పోతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌ ను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జనాభా పెరుగుదల వల్ల ఈ సంక్షోభం తలెత్తినట్లు స్థానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఫ్లాట్లను కేవలం 100 రూపాయలే అమ్మేశారు. అదేంటి.. అనుకుంటున్నారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటంటే?


ఇంటి సైజు పెరిగేకొద్దీ దాని నిర్వహణకు అధికంగా డబ్బు కావాల్సి ఉంటుంది. యూకేలోని కార్న్‌వాల్‌ కౌన్సిల్ వద్ద ఉన్న 11 ఫ్లాట్లకు కూడా నిర్వహణ ఖర్చులు భారీగా ఉన్నాయి. వీటిని ఉంచుకోవడం కంటే కూడా అమ్మేయడం బెటర్ అనేలా నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో కార్న్‌వాల్ కౌన్సిల్ ఆయా ఫ్లాట్లను అమ్మేసింది. కార్న్‌వాల్ కౌన్సిల్ లూయీలోని 11 ఫ్లాట్లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ కి విక్రయించడానికి అంగీకరించింది.


64,000 పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.6,61,64,745 విలువైన గ్రేడ్ II లిస్టెడ్ ఫ్లాట్లను నామమాత్రం 1 పౌండ్ అంటే భారత కరెన్సీలో రూ.103 కే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కార్నిష్ పట్టణం మధ్యలో తక్కువ ధరలో ఇళ్లు దొరికే అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్న్‌వాల్ కౌన్సిల్ తెలిపింది. సెప్టెంబర్ 13వ తేదీన కౌన్సిల్ క్యాబినెట్ లూయీలోని 11 కోస్ట్ గార్డ్ ప్లాట్ల యాజమాన్యాన్ని నామ మాత్రపు రుసుముతో కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ కు బదిలీ చేయాలి అనే సిఫార్సుకి ఆమోదం తెలిపింది.