Coalition Government in Pakistan: పొరుగున ఉన్న పాకిస్థాన్‌(Pakistan)లో సంకీర్ణ ప్ర‌భుత్వం(Government) ఏర్ప‌డ‌నుంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఏపార్టీకీ పూర్తిస్థాయిలో మెజారిటీ క‌ట్ట‌బెట్ట‌లేదు. దీంతో కూట‌మిగా ఏర్ప‌డిన పార్టీలే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింది. ఈ విష‌యంలో అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. తాజాగా మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Shebajsharif) నేతృత్వంలోని పాకిస్థాన్​ ముస్లిం లీగ్‌ నవాజ్‌(PML-N), బిలావల్‌ భుట్టోకు చెందిన పాకిస్థాన్​ పీపుల్స్‌ పార్టీలు(PPP) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌(72)(ఈయ‌న మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ త‌మ్ముడు) మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఈ మేర‌కు బిలావల్ భుట్టో స్వ‌యంగా ప్రకటించారు. ఒప్పందం ప్రకారం పీపీపీ కీలక నేత ఆసిఫ్‌ జర్దారీ(Asif Jardari) పాక్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 


ఇమ్రాన్ పార్టీదే ఆధిప‌త్యం అయినా.. 


పాకిస్థాన్‌లో ఈ నెల 8న 265 పార్ల‌మెంటు స్థానాలకు సార్వ‌త్రిక ఎన్నికలు(General Elections) జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(PTI) పార్టీ అధినేత‌ ఇమ్రాన్‌ ఖాన్‌(Imrankhan) మద్దతుదారులు అత్యధికంగా 93 స్థానాల్లో గెలుపొందారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం 133 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో 75 సీట్లు సాధించిన పీఎంఎల్ఎన్, 54 స్థానాల్లో నెగ్గిన పీపీపీ మధ్య పలుసార్లు చర్చలు జరిగాయి. ఇంకేముంది ప్ర‌భుత్వం ఏర్పాటు ఖాయం.. అని అనుకుంటున్న స‌మ‌యంలో అనూహ్యంగా ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది. ఎందుకంటే..వీరు క‌లిసి మేజిక్ ఫిగ‌ర్ అందుకోవ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న ఉంది. దీంతో 17 సీట్లు ఉన్న‌ మరో పార్టీ ఎంక్యూఎం-పీని మ‌చ్చిక చేసుకుని ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పీఎంఎల్ఎన్​, పీపీపీ ప్రకటించాయి.


ఎన్నిక‌లు ముగిసిన 11 రోజుల‌కు 


ఎన్నిక‌లు ముగిసిన 11 రోజుల‌కు కానీ.. కూట‌మి పార్టీలు ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోయాయి. ఇదే విష‌యాన్ని  పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో కూడా చెప్పుకొచ్చారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడుతుందని తాను ముందుగానే భావించినట్లు చెప్పారు. దేశాన్ని ఏ ఒక్క పార్టీ కూడా నడపలేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నదే ప్రజల సందేశమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి 11రోజులకు పైగా గడిచిందని, వాటి చట్టబద్ధతపై ప్రశ్నలు వ‌స్తున్నాయన్నారు. ఆ తర్వాత కాసేపటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన విడుదలైంది.


ఇమ్రాన్ ఫైర్‌..


పాకిస్థాన్​ ఎన్నికల ప్రక్రియను `మదర్​ ఆఫ్ ఆల్ రిగ్గింగ్` అని మాజీ ప్రధాని, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న‌ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రజల తీర్పును దోచుకున్న నాయకులు దానిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పలు కేసుల్లో దోషిగా శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్​ ఖాన్​ను ఆయన సోదరి అలీమా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఆమె ఇమ్రాన్ సందేశాన్నివెల్ల‌డించారు. ఇమ్రాన్ ఖాన్‌పార్టీ పీటీఐని సుప్రీంకోర్టు ర‌ద్దు చేయ‌డం.. ఎన్నిక‌ల సంఘం కూడా పోటీకి దూరంగా ఉంచ‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ఇమ్రాన్‌మ‌ద్ద‌తు దారులు ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేశారు. వీరు గెలిచిన త‌ర్వాత కూడా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. 


సంకీర్ణ ప్ర‌భుత్వంలో ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని సీట్లు?


PML-N: 75 


PPP: 54 


MQM-P: 17 


+ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, 266 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ దిగువసభలో పోటీ చేసిన 265 సీట్లలో పార్టీ 133 గెలుచుకోవాలి. ఇప్పుడు కూట‌మి పార్టీలకు ఉన్న ఎంపీల సంఖ్య 146. దీంతో ఈ పార్టీలు సంకీర్ణ స‌ర్కారు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగ‌మ‌మైంది.