Trump on China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేయకూడదని అంగీకరించిందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి  ను శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామంపై ట్రంప్ తన  ట్రూత్ సోషల్  ప్లాట్‌ఫామ్‌లో స్పందిస్తూ, హార్ముజ్ జలసంధిని నేను శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రపంచం కోసం ,  వారి కోసం కూడా నేను చేస్తున్నాను. ఇకపై ఇరాన్‌కు ఆయుధాలు పంపకూడదని వారు అంగీకరించారు  అని రాసుకొచ్చారు. రాబోయే కొద్ది వారాల్లో తాను చైనా పర్యటనకు వెళ్తున్నానని, అక్కడ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తనను ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే, ఈ వ్యవహారం వెనుక అమెరికా గట్టి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు.  ఈ సమయంలోనే షీ జిన్‌పింగ్‌కు తాను లేఖ రాశానని, దానికి సమాధానంగా ఇరాన్‌కు ఎటువంటి సైనిక సహాయం అందించడం లేదని చైనా నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని ట్రంప్ వివరించారు. అమెరికా ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ గత కొన్ని రోజులుగా ఖండిస్తూనే ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని తన దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు.  

మరోవైపు, హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా నావికా దళం అక్కడ దిగ్బంధనం కొనసాగిస్తే, తాము కూడా ఎర్ర సముద్రం గుండా వాణిజ్యాన్ని అడ్డుకుంటామని ఇరాన్ మిలిటరీ హెచ్చరించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం , అమెరికా జోక్యం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, హార్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడం చైనా వంటి ఇంధన దిగుమతి దేశాలకు అత్యంత అవసరం.                              

 ట్రంప్ ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. చైనా నిజంగానే ఇరాన్‌కు దూరం జరుగుతుందా? లేదా తన వాణిజ్య ప్రయోజనాల కోసం తాత్కాలికంగా ట్రంప్‌తో సర్దుబాటు చేసుకుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మే నెలలో జరగనున్న ట్రంప్ చైనా పర్యటనతో ఈ ఉత్కంఠకు పూర్తిస్థాయిలో తెరపడనుంది.