China Unveils New Bullet Train Prototype: వేగవంతమైన రైలు అంటేనే మనకు గుర్తొచ్చేది.. బుల్లెట్ ట్రైన్ (Bullet Train). ఈ రైళ్లల్లో కొత్త కొత్త ఆవిష్కరణలను చైనా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా, మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును తీసుకొచ్చింది. సీఆర్450గా వ్యవహరించే ఈ బుల్లెట్ రైలును ఆదివారం బీజింగ్‌లో పరిష్కరించారు. ఈ రైల్ డిజైన్ నాజూగ్గా, బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని.. గంటకు 400 కి.మీల వేగాన్ని అందుకుందని చైనా రైల్వే వెల్లడించింది. ఇది అత్యధికంగా గంటకు 450 కి.మీల వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఈ ట్రైన్ బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. గతంలో ఈ ప్రయాణానికి 4 గంటల సమయం పట్టేది. ఈ నూతన ఆవిష్కరణ వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని తెలిపింది.


ఇవీ ప్రత్యేకతలు..




ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతి పెద్దది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చైనా ప్రభుత్వ రంగ రైల్వే సంస్థ సీఆర్450 (CR450) ప్రోటోటైప్‌ను డిసెంబరులో పరీక్షిస్తామని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. హైస్పీడ్ రైల్వే వ్యవస్థ మొత్తం 45 వేల కిలోమీటర్ల వరకూ విస్తరించింది. కాగా, చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్స్, సొరంగాలు నిర్మించనున్నారు. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం తక్కువ. విద్యుత్ సైతం 20 శాతం తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఈ రైలు అత్యధికంగా గంటకు 453 కి.మీ వేగాన్ని అందుకుంది.


మరోవైపు, చైనా రెండ్రోజుల క్రితమే ఆరో తరానికి చెందినదిగా చెబుతున్న జె-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో దీన్ని అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారు. ఇది అమెరికాకు చెందిన ఎఫ్ 35, ఎఫ్ 22 రాప్టర్లను సవాల్ చేయగలదని పేర్కొంటున్నారు.


Also Read: South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు