China Donkey Crisis: పాకిస్తాన్ గాడిదలను చైనా పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటోందని ఇటీవల వార్తలు వచ్చాయి. టెర్రరిస్టులకు గాడిదలనే కోడ్ భాష వాడుతుందేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిజంగానే పాకిస్తాన్ నుంచి చైనా గాడిదల్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. దీనికి కారణం గాడిదల కొరత ఉండటమే. ఇంతకీ చైనాలో గాడిదల కొరత ఎందుకు ఏర్పడిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సింది. వాటిని పెంచుకోవడంలేదు. కనీసం మాంసంగా వాడటం లేదు. ఇంకా ఘోరమైన పనులకు వాడుతున్నారు.
చైనాలో ఎజియావో అనే ఓ మందుకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఇది వృద్ధాప్యాన్ని నిరోధించడంలో, రక్త ప్రసరణను పెంచడంలో మరియు మహిళల సంతానోత్పత్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపితమయిదంి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఔషధానికి డిమాండ్ వేగంగా పెరగడం వల్ల బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఈ మందుకు, గాడిదలు తగ్గిపోవడానికి సంబంధం ఉంది. ఎందుకంటే గాడిదల చర్మం నుంచే ఎజియావో మందును తయారుచేస్తారు మరి. ఎజియావో చైనాలో గాడిదల చర్మం నుండి తయారయ్యే ఒక సాంప్రదాయ ఔషధం. ఎజియావోను సౌందర్య ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తి చైనాలో అత్యంత ప్రజాదరణ పొందినది.ఈ ఔషధ వ్యాపారం సుమారు 58,000 కోట్ల రూపాయల (7.8 బిలియన్ డాలర్లు) విలువైనదిగా అంచనా. కానీ ఇప్పుడు ఇది తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. ఎప్పటికప్పుడు గాడిదల్ని వధించి ఈ ఔషధాన్ని ఉత్త్తి చేస్తున్నారు. ఈ కారణంగా చైనాలో గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 1990లలో చైనాలో 11 మిలియన్ గాడిదలు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 2 మిలియన్ల కంటే తక్కువకు తగ్గింది. ఈ కొరత ఎజియావో ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థం (గాడిద చర్మం) లభ్యతను తగ్గించింది.
ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా నుండి చైనా గాడిదలను దిగుమతి చేసుకుంటోంది, కానీ ఈ దేశాలు గాడిదల ఎగుమతిపై నిషేధాలను విధిస్తున్నాయి. ఆఫ్రికన్ యూనియన్ 2024లో గాడిదల చర్మం ఎగుమతిని నిషేధించింది, దీనివల్ల చైనాకు ముడి పదార్థ సరఫరా తగ్గింది.గాడిదల కొరత వల్ల ముడి పదార్థ ధరలు పెరిగాయి, ఇది ఉత్పత్తి ఖర్చులను పెంచింది. కొరత తక్కువగా ఉండటంతో చైనా మార్కెట్లో నకిలీలు పెరుగుతున్నాయి.
ఈ సంక్షోభం ఎజియావో ఉత్పత్తి కేంద్రాలైన షాండాంగ్ వంటి ప్రాంతాలలో స్థానిక ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోంది. ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. గాడిదల డిమాండ్ వల్ల అంతర్జాతీయంగా గాడిదల సంఖ్య తగ్గుతోంది. మరో వైపు జంతు హక్కుల సంస్థలు గాడిదలను చంపడం జంతువుల జీవించే హక్కును ఉల్లంఘించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాయని వాదిస్తున్నాయి. దీంతో చైనాకు గాడిదల ఎగుమతి తగ్గుతోంది.