Canada :    అమెరికా కాకపోతే కనీసం కెనడా అయినా  వెళ్లాలనుకునేవారికి మన దేశంలో కొరత ఉండదు.అలాంటి వారికి కెనడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  కెనడాలో కొనసాగుతున్న కార్మికుల కొరతను అధిగమించడానికి ఆ దేశం వర్క్ పర్మిట్ నిబంధనలను సడలించాలని తాజాగా నిర్ణయించింది. ఇతర దేశాలకు చెందిన వాళ్లు శాశ్వతంగా తమ దేశంలో కుటుంబ సభులతో కలిసి పని చేయడానికి అనుమతించే కొత్త నిబంధనలను ప్రకటించాలని కెనడియన్ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికుల కొరతను తగ్గించేందుకు.. వీసాల జారీ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ జీవిత భాగస్వామి కోసం దరఖాస్తు పెట్టుకున్న వీసా ప్రక్రియను త్వరగా మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఎవరైనా కెనడాకు రావాలనుకునేవారి దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.                           


కెనడాలో భారీ ఎత్తున ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు ఆ దేశ లేబర్‌ ఫోర్స్‌ చేసిన సర్వే వివరాలు వెల్లడించింది.   మొత్తం 10 లక్షలకుపైగా లేబర్ ఫోర్స్ అవసరం దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. దీనికి తోడు దేశంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్‌ వయస్సుకు దగ్గరపడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది కెనడా అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇది 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని అంచనా. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులను ఆకర్షిస్తోంది. 


వృత్తి నిపుణులు, సైంటిఫిక్‌-టెక్నికల్‌ సేవలు అందించేవారు, రవాణా, గోదాములు, ఫైనాన్స్‌, ఇన్యూరెన్స్‌, వినోద రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో  , విద్యారంగంలో  ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10శాతం పెరిగాయి. అలాగే కెనడాలో రానున్న పదేళ్లలో దాదాపు 90 లక్షల మంది రిటైర్మెంట్‌కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో పదవీ విరమణ వయస్సు కన్నా ముందుగానే రిటైర్మెంట్లు తీసుకొంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగా తీసుకునేవే ఉంటాయి.                           


 రాబోయే దశాబ్ద కాలంలో వ్యవసాయ కార్మికులతోపాటు నర్సరీ, గ్రీన్‌హౌస్‌ కార్మికులు, సాధారణ కూలీలు దాదాపు 24 వేల మంది కొరత ఏర్పడుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. ప్రస్తుతం కెనడాలో 60 శాతం మంది 65 ఏళ్లు పైబడినవారే. దీంతో భవిష్యత్తులో వారు పనికి దూరం కానున్నారని అంచనాకు వచ్చారు. వ్యవసాయం చేయడానికి అక్కడున్నవారు వ్యవసాయాన్ని కొనసాగించడానికి 66 శాతం మంది ఇష్టపడకపోవడమే కార్మిక సంక్షోభానికి మరొక కారణమని పరిశోధన పేర్కొంది.  అందుకే కార్మిక సంక్షోభాన్ని కొంతమేరకైనా తీర్చుకోవడానికి కెనడా ప్రయత్నిస్తోంది. తాత్కాలిక విదేశీ వలస కార్మికులకు వరాలు కురిపిస్తోంది.