Blast rocks mosque in Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో భారీ పేలుడు జరిగింది.   శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఒక మసీదులో సంభవించిన భారీ పేలుడు నగరాన్ని వణికించింది.  ఇస్లామాబాద్‌లోని షాజాద్ టౌన్ పరిధిలో ఉన్న మసీదు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ప్రార్థనల కోసం భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడిన సమయంలో ఈ  పేలుడు సంభవించడంతో  భారీగా ప్రాణనష్టం జరిగింది. యాభై నుంచి వంద మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.                     పేలుడు తీవ్రతకు మసీదు గోడలు కూలిపోయాయని, పలువురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.            

Continues below advertisement

ఈ దాడిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పాకిస్తాన్ సైన్యం ,  బాంబు స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్ నగరం అంతటా అత్యవసర పరిస్థితి  ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రధాన రహదారులను మూసివేసి, నగరాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.  ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు మళ్లీ పెరుగుతున్నాయి.

Continues below advertisement

 గత నవంబర్‌లో కూడా ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మసీదు పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. అయితే, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీపై ఇటీవల పాక్ సైన్యం ఊచకోతకు పాల్పడటంతో  ప్రతీకారంగా  ఈ దాడి జరగిందని  భావిస్తున్నారు.