Bill Gates apologises to over Epstein ties : గతంలో లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో ఉన్న సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. ఎప్స్టీన్‌తో పరిచయం పెంచుకోవడం తాను చేసిన ఒక పెద్ద తప్పని, అది తన వ్యక్తిగత,  వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీసిందని ఆయన అంగీకరించారు. ఈ మేరకు  బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్  ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో ఆయన తన విచారాన్ని వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Continues below advertisement

ఎప్ స్టీన్‌తో జరిపిన భేటీలు కేవలం దాతృత్వ కార్యక్రమాలకు నిధులు సేకరించే ఉద్దేశంతోనే జరిగాయని బిల్ గేట్స్ గతంలో వివరణ ఇచ్చారు. అయితే, ఎప్ స్టీన్ నేర చరిత్ర తెలిసినప్పటికీ ఆయనతో సమావేశం కావడం సరైన నిర్ణయం కాదని ఇప్పుడు గేట్స్ భావిస్తున్నారు. ఈ సంబంధం కారణంగా ఫౌండేషన్ ప్రతిష్టకు, సిబ్బంది నైతికతకు కలిగిన ఇబ్బందులకు తాను బాధ్యత వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ సాగిస్తున్న ఉన్నతమైన ఆశయాలకు ఇటువంటి వివాదాలు అడ్డంకిగా మారకూడదని ఆయన ఆకాంక్షించారు.    

ఈ వ్యవహారం బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ఎప్ స్టీన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలే ప్రధాన కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎప్ స్టీన్‌తో బిల్ గేట్స్ భేటీలు కావడంపై మెలిండా మొదటి నుంచీ అసంతృప్తిగా ఉన్నారని, వారి విడాకుల ఒప్పందంలో ఈ అంశం కీలక పాత్ర పోషించిందని  భావిస్తున్నారు.   

ప్రస్తుతం బిల్ గేట్స్ తన తప్పులను దిద్దుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఫౌండేషన్ పారదర్శకతను పెంచేందుకు, ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గతాన్ని వెనక్కి తీసుకోలేమని, అయితే భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు.