పాకిస్థాన్‌లో ఉగ్రమూకలపై ఆ దేశ సైన్యం దాడి చేసింది. సైనిక స్థావరాలలోకి ఉగ్రమూకలు చొరబడేందుకు ప్రయత్నించగా సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు, నలుగురు సైనికులు మరణించారు. ఘటనలో వీరమరణం పొందిన పాక్ సైనికులకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాళులర్పించారు. వారి ప్రాణత్యాగాలను కీర్తించారు.
బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాకు బయలుదేరే కొన్ని గంటల ముందే ఈ ఘటన జరిగింది.
ఏం జరిగింది?
నైరుతి బలూచిస్థాన్ రాష్ట్రంలో పంజగుర్, నౌష్కి సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఉగ్రదాడులను పాక్ సైన్యం ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది అనంతరం మరణించారు.
అయితే ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పాక్ అంతర్గ వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు.
ఈ దాడులకు నిషేధిత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. సైనిక స్థావరాలలోకి చొరబాటుకు ప్రయత్నించినట్లు పేర్కొంది. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థ బీఎల్ఏ ఆ ప్రాంతంలో నిరంతరం దాడులకు పాల్పడుతోంది.
Also Read: ISIS Leader Encounter: ఐసిస్ లీడర్ హతం.. ప్రత్యేక ఆపరేషన్‌లో మట్టుబెట్టిన అమెరికా బలగాలు