రోజు పని చేసే ల్యాప్‌టాప్‌తోనో.. మెషీన్‌తో మాట్లాడుకుంటూ వర్క్‌ చేస్తుంటే ఎలా ఉంటుంది.! జస్ట్‌ మాటలే కాదు ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేస్తున్నట్టు వాటితో కూడా అన్ని రకాల టాపిక్స్‌ గురించి డిస్కషన్‌ చేస్తే...? బీపీ లెవల్స్‌ పెరిగిపోతున్నాయి కాస్త కంట్రోల్ ఉండు యార్‌ అని చేతికి పెట్టుకొన్న స్మార్ట్‌వాచ్‌ మనల్ని తిడితే..! హార్ట్‌బీట్‌ పెరిగిపోతుంది. ఎందుకు ఊరికే టెన్షన్‌ పడతావు అంటూ చొరవ తీసుకుని వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంటూ చాలా ఏళ్ల క్రితం అనుకున్నాం. కానీ అలా అనుకున్న కొద్ది రోజులకే ఆ టెక్నాలజీ మొత్తం అందుబాటులోకి వచ్చాయి.


ఈ టెక్‌ యుగంలో సెకన్ల వ్యవధిలోనే ప్రపంచదేశాల్లో ఏం జరుగుతుందో అన్ని ఇట్టే తెలిసిపోతున్నాయి. అంతేకాదు.. స్మార్ట్‌ వాచ్‌ల నుంచి స్మార్ట్ వాహనాల వరకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. రోజుకో కొత్త టెక్నాలజీ ఎక్కడో ఓ చోట అందుబాటులోకి వస్తూనే ఉంది. ఇప్పుడు అలాంటి మరో సూపర్‌ స్మార్ట్‌ యాప్ వచ్చింది. రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఫ్లైఓవర్ల మీద ప్రమాదాలకు ఓవర్‌ స్పీడ్‌ ఒక కారణం అయితే....ఫ్లైఓవర్‌ నిర్మాణాల్లో ఉన్న లోపాలు కూడా మరో కారణంగా కనిపిస్తున్నాయి. గతంలో ఓవర్‌ స్పీడ్‌ చాలా మంది ప్రాణాలు తీస్తే.. ఇప్పుడు ఫ్లైఓవర్‌లో ఉన్న లోపాలకు కూడా ప్రజలు బలి అవుతున్నారు. అసలు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటీ..?  అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న!. అయితే ఈ ప్రమాదాలను ముందుగానే తెలుసుకుని వాహన డ్రైవర్ ను అలెర్ట్ చేసే ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. 


బ్రిడ్జి స్థితిని తెలిపే మొబైల్‌ యాప్‌:
వాహనాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందిన స్మార్ట్‌ఫోన్లు వంతెనను దాటేటప్పుడు ఆ వంతెన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర డాటాను సేకరించి, వాహనదారుడికి తెలిపే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ యాప్‌... వాహనదారుడు వెళ్లే.. బ్రిడ్జీ స్థితిని తెలిపేందుకు ఈ మొబైల్‌ యాప్‌ను రెడీ చేశారు. అయితే ఈ విధానం తక్కువ ఖర్చుతో కూడుకున్న మెరుగైన ప్రత్యామ్నాయమని పరిశోధకులు తెలిపారు. బ్రిడ్జిలో ఎలాంటి లోపమున్నా.. వెంటనే వాహనదారుడి మొబైల్‌ ఫోన్‌కు నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని వెళ్లడించారు. ఇప్పటికే పలు బ్రిడ్జిలకు సెన్సర్లు అమర్చి, ట్రైల్‌ టెస్ట్‌ చేశామని, అందులో ఈ యాప్‌ చాలా కచ్చితమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు.


దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగి పోతుండటంతో వాటిని కొంతమేరకైనా తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. కార్లు, ట్రక్లు, బస్సులలో వినియోగించే టైర్లలో నిర్దిష్ట ప్రమాణాలను కేంద్రం సూచించింది. ఇకపై నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న టైర్లను మాత్రమే వాహనాలకు అమర్చాల్సిందిగా వెల్లడించింది. దేశీయ వాహనాల వినియోగంలో ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై కార్లు, ట్రక్కులు, బస్సుల్లో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన టైర్లను మాత్రమే వాహనాలకు అమర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై దేశంలో వినియోగించే టైర్లకు కొత్త రోలింగ్ రెసిస్టెన్స్‌, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ విషయాల్లో కొత్త ప్రమాణాలకు అనుగుణంగా తయారీ నిబంధనల్ని నిర్దేశించింది.