Israel vs Iran: ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి కారణం ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందన్నది ప్రధాన కారణం. ఇరాన్ ఈ యుద్ధంలో సరెండర్ కావాల్సిందే అన్న అమెరికా బెదిరింపులకు కూడా ఇరాన్ అణు శక్తే కారణం. ఈ యుద్ధం ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ వద్ద అణు బాంబులు ఉండకూడదన్న లక్ష్యంతో ఉన్నాయి. అయితే ఇరాన్ అణుశక్తి దేశంగా మారడానికి ప్రధానకారణం ఎవరో తెలుసా? ఎవరైతే ఇప్పుడు ఇరాన్ అణు బాంబులు తయారు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారో, ఆ అమెరికానే. నాడు ఇరాన్‌ను అణుశక్తి గల దేశంగా మార్చింది అమెరికా. నాడు అసలేం జరిగింది? ఎందుకు అమెరికా ఇరాన్‌కు అణు హస్తం అందించింది? ఇప్పుడు ఎందుకు వద్దంటోంది అన్న విశ్లేషణే ఈ కథనం.
నాడు అమెరికా మిత్ర దేశంగా ఇరాన్.
1950వ దశకంలో ఇరాన్‌ను షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలన సాగుతోంది. ఆ సమయంలోనే ఇరాన్ అణు కార్యక్రమానికి బీజాలు పడ్డాయి. ఆయన పాలనలో ఇరాన్‌కు అమెరికాతోపాటు, ఇతర పాశ్చాత్య దేశాలతో మంచి సంబంధాలను నెరిపారు. ఈ క్రమంలో 1957లో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ "శాంతి కోసం అణుశక్తి" (Atoms for Peace) కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా అనేక ఇతర దేశాలతోపాటు ఇరాన్‌కు అణు సాయం అందించారు. ఈ కార్యక్రమం కింద అణుశక్తిని విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, వైద్య పరిశోధనలకు వినియోగించాల్సి ఉంది. ఇందుకోసం ఇరాన్ దేశానికి శాంతియుత ప్రయోజనాల పేరుతో అణుసాంకేతికతను అందించారు. ఇందులో భాగంగా అమెరికా, టెహ్రాన్ నగరంలో ఒక పరిశోధనా రియాక్టర్‌ను నిర్మించింది. దీన్ని టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ (TRR) అని అంటారు. ఇది టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్‌లో అణు పరిశోధనా కేంద్రంలో భాగంగా ఉంది. ఇరాన్ శాస్త్రవేత్తలకు అమెరికానే స్వయంగా శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT)పై ఇరాన్ సంతకం చేసింది. అణుశక్తిని కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమే వినియోగిస్తామని వాగ్దానం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అంగీకారం తెలిపింది. ఇలా ఇరాన్‌కు అణుశక్తిని కల్పించిన దేశం అమెరికానే.
ఇస్లామిక్ విప్లవంతో మారిన ఇరాన్-అమెరికా సంబంధాలు
ఇరాన్‌లో 1979లో షా మొహమ్మద్ రెజా పహ్లవి పాలనకు వ్యతిరేకంగా ఇస్లామిక్ విప్లవం ఎగసిపడింది. దీంతో షా పాలన అంతమైంది. దీంతో కొత్తగా ఏర్పడిన పాలకులకు అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి. అణు కార్యక్రమానికి తన సాయాన్ని కూడా అమెరికా నిలిపివేసింది. ఇరాన్ పాలకులు కూడా అణుశక్తి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇరాన్-ఇరాక్ యుద్ధం 1980-88 వరకు సాగింది. ఈ క్రమంలో దేశ భద్రత విషయంలో అణు అవసరాలను గుర్తించిన ఇరాన్ పాలకులు తిరిగి అణు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించారు. అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలని తీర్మానించారు. అయితే అమెరికా సహా, పశ్చిమ దేశాలపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నారు. స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేశారు. అమెరికాను వ్యతిరేకించే రష్యా, చైనా వంటి దేశాల సాయం పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
రహస్యంగా అణ్వాయుధాల తయారీ దిశగా ఇరాన్
ఇలా ఇరాన్-అమెరికాల మధ్య దూరం పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో అమెరికా విదేశాంగ విధానం మారిపోయింది. 2000వ దశకంలో ఇరాన్ రహస్యంగా యురేనియం శుద్ధి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్న విషయం బయటపడింది. యురేనియంను తక్కువ స్థాయిలో శుద్ధి చేస్తే అణు విద్యుత్‌కు వినియోగించవచ్చు. అదే 90 శాతం శుద్ధి చేస్తే అణు బాంబులు తయారు చేసే వీలుంది. ఇలా అణ్వస్త్రాల తయారీని రహస్యంగా ఇరాన్ చేపడుతుందన్న అనుమానాలు తలెత్తాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పూర్తి స్థాయి తనిఖీలకు అనుమతించకపోవడం. దీంతో అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా ఉండేందుకు కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి.
జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందం
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేందుకు 2015లో ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలోని ఐదు దేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా) లతో పాటు జర్మనీతో ఇరాన్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందం కుదిరింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఈ ఒప్పందం ప్రకారం పరిమితం చేయడానికి అంగీకరించింది, బదులుగా ఆంక్షలు ఎత్తివేయడానికి ఈ దేశాలు అంగీకరించాయి. అయితే దీన్ని 2018లో నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగారు. ఈ ఒప్పందం కాలం చెల్లిందని, ఇందులో ఎన్నో లోసుగులు ఉన్నాయని, ఇరాన్‌కు అణు బాంబులు తయారు చేసుకునే రీతిలో నిబంధనలు ఉన్నాయన్నది ట్రంప్ వాదన. మరో వైపు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని ఒత్తిడి పెంచాయి. ఈ కారణాలతో ట్రంప్ ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అణు ఒప్పందాన్ని క్రమక్రమంగా ఉల్లంఘించడం మొదలు పెట్టింది. యురేనియం శుద్ధిని, శుద్ధి స్థాయిని పెంచుతూ తన అణు కార్యక్రమానికి పదును పెట్టింది.
ఇరాన్ అణు మూలాలకు పునాది వేసింది అమెరికానే. తిరిగి ఆ పునాదులు కూల్చాలనుకుంటోంది అమెరికానే. ఇందులో అమెరికా-ఇరాన్ సంబంధాల నేపథ్యంలోనే కథ మొత్తం మారిపోయింది. ఏదైనా ఒక దేశానికి తన తాత్కాలిక ప్రయోజనాల కోసం సాయం చేయడం, ఆ తర్వాత పరిణామాలన్నీ తన తలకే చుట్టుకోవడం అమెరికాకు తరచుగా జరుగుతుంది. ఇలా తాను పెంచి పోషించిన శక్తుల నుంచి తిరిగి ఎలాంటి ప్రమాదాలు తనకు ఎదురవుతాయన్న అంశాలను అంచనా వేయడంలో అమెరికా తరచు ఫెయిల్ అవుతుందనడానికి ఇదో కారణంగా చెప్పవచ్చు.