US Pesident Donald Trump | వాషింగ్టన్: అమెరికాకు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ స్నేహాన్ని అమెరికా ఎంజాయ్ చేస్తోందని, కానీ వాణిజ్య పరంగా ఎన్నో ఏళ్ల నుంచి భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ "భారీ సుంకాలు" విధిస్తోందని మంగళవారం నాడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
భారత్ విధించే సుంకాలే అధికం..
భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను తగ్గించే యోచన ఉందా అని వైట్‌హౌస్‌లో అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మాత్రమే పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చిందన్నారు. భారత్ మా నుంచి భారీ సుంకాలు వసూలు చేస్తోంది, ప్రపంచంలోనే అమెరికా మీద అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆయన అన్నారు. మేం భారతదేశంతో పెద్దగా వ్యాపారం చేయలేదు. కానీ వారు మా దేశంలో మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మేం మొన్నటివరకూ భారత్ మీద భారీ సుంకాలు విధించలేదు. దాంతో మాకే అధిక నష్టం వాటిల్లిందని, భారత్ చేసే వ్యాపారంతో తమకు ఎలాంటి ప్రయోజనం లేనది సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ తమ మీద 200 శాతం సుంకాలు విధించిందన్న ట్రంప్
హార్లే- డేవిడ్‌సన్ బైకుల విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. హార్లే- డేవిడ్‌సన్ కంపెనీ భారతదేశంలో 200 శాతం వరకు సుంకాలు చెల్లిస్తోంది. అప్పుడు ఏం జరుగుతుంది.. ఈ ఖర్చలు భరించలేక, హార్లే డేవిడ్‌సన్ భారతదేశానికి వెళ్లి అక్కడే మోటార్‌సైకిల్ ప్లాంట్‌ను నిర్మించింది. దానివల్ల వారు ఆ కంపెనీ ఉత్పత్తులపై సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ విధానం అమెరికా తయారీదారులకు జరుగుతున్న అన్యాయమని ట్రంప్ పేర్కొన్నారు.
"మా దేశంలో తయారుకావాల్సిన ఉత్పత్తులు ఇక నుంచి భారతదేశంలో మానుఫ్యాక్చర్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోనే అమెరికా కంపెనీలు ఉత్పత్తులు చేసి మా దేశానికి ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇది అమెరికా కంపెనీలకు ప్రతికూలంగా మారుతుంది. కానీ మేము భారత్‌కు ఏదీ ఎగుమతి చేయలేం. వారు మా నుంచి 100% సుంకాలు వసూలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
సుంకాలను సుంకాలతోనే ఎదుర్కొంటున్న అమెరికా..
అమెరికా ఎగుమతులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారు. కానీ భారత ఉత్పత్తులు సంవత్సరాలుగా US మార్కెట్‌లోకి ప్రవాహంలా రావడం నిజం కాదా అని ప్రశ్నించారు. భారత్ విధిస్తున్న భారీ సుంకాలతో అమెరికా వదిలి కంపెనీలు ఆ దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయడం మాకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి వాటిని భర్తీ చేయడానికి, అమెరికా ప్రయోజనాల కోసం సుంకాలు విధించినట్లు తన నిర్ణయాలను ట్రంప్ సమర్థించుకున్నారు.