గత వారం రోజులుగా అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. తాలిబన్లు ఒక్కసారిగా రంగంలోకి దిగడంతో ఆ దేశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విదేశాలకు పారిపోవడంతో వారికి ఏ ఇబ్బంది లేకుండా అధికారం హస్తగతమైంది. ముఖ్యంగా మహిళల పరిస్థితి గతంలో కంటే మరీ దారుణంగా తయారైంది. వారి హక్కులను కాలరాస్తూ, బానిసలుగా మార్చే ప్రక్రియ మొదలైంది.
విమానాలలో ప్రయాణిస్తూ దారి మధ్యలోనే కింద పడి మరణించిన వారు కొందరైతే, విమానంలోనే చనిపోయి శవాలు వేలాడపడిన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల తరువాత అఫ్గాన్ లోని తాలిబన్ల చెర నుంచి బయటపడి భారత్‌కు చేరుకున్న ఓ వ్యక్తి తాను అనుభవించిన వేదన, నరకయాతనను వివరించాడు. అఫ్గాన్ నుంచి ప్రాణాలతో బయటపడి స్వదేశానికి చేరుకున్న వేలాది మందిలో కర్ణాటకకు చెందిన మెల్విన్ ఒకరు. కాబూల్‌లోని ఓ ఆసుపత్రిలో మెల్విన్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల నరకం తరువాత తాను బుధవారం నాడు స్వస్థలం మంగళూరులోని ఉల్లాల్ చేరుకున్నానని మెల్విన్ తెలిపాడు.
Also Read: Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు
మెల్విన్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే.. నాలుగు రోజులు నరకం అనుభవించాను. ఆకలితో అలమటించా. నాతో ఉన్న డబ్బు దోచుకున్నారు. వేరు చోటకి తరలించే ప్రయత్నం చేశారు.. చివరికి ఇంటికి చేరుకున్నాను. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నారు. దాంతో చాలా మందితో పాటు నేను కాబూల్ ఎయిర్‌పోర్టుకు పరుగులు తీశాను. రెండు రోజులపాటు విమానాశ్రయంలో ఆహారం, నీళ్లు కూడా లేవు. దేవుడు దయతలచడంతో నాకు కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి భారత్‌కు డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది. రాత్రివేళ విమానాల కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూశారు. చాలా మందికి విదేశాలకు అంటే లండన్, దుబాయ్, నార్వే లాంటి ప్రాంతాలకు వెళ్లే విమానాలలో చోటు దక్కింది.
నా సోదరుడు కూడా అఫ్గానిస్థాన్‌లో పనిచేస్తున్నాడు. అతడికి నేరుగా భారత్‌కు వచ్చే విమానం దొరకలేదు. ఎలాగోలా కష్టపడి అతడితో మాట్లాడాను. తనకు ఖతార్‌కు వెళ్లే విమానంలో చోటు దొరికిందని చెప్పాడు. నేను సి-17 గ్లోబ్ మాస్టర్ విమానం ఆగస్టు 16న ఎక్కాను. గుజరాత్ లోని జామ్ నగర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాను. ఢిల్లీ నుంచి మా సొంత ప్రాంతానికి రాగలిగాను. నాలాగ ఎంతో మంది అఫ్గాన్ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ఆకలితో అలమటించారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు. మా మంగళూరు వాసులు చాలా మంది అఫ్గాన్‌లో చిక్కుకుపోయారు. భారత వాయు సైన శ్రమించి కొంత మందిని స్వదేశానికి తీసుకొచ్చింది.
Also Read: Afghan Footballer Death: విమానం నుంచి జారిపడి అఫ్గాన్ నేషనల్ ఫుట్ బాలర్ మృతి
గత కొన్నేళ్ల నుంచి కాబూల్‌లో నివాసం ఉంటున్నాను. కానీ ఎన్నడూ ఇలాంటి భయానక వాతావరణాన్ని చూడలేదు. అమెరికా సేనలు తప్పుకోగానే తాలిబన్లు చెలరేగిపోయారు. కరోనా కారణంగా స్థానికులను ఇళ్లకే పరిమితం చేయడంతో తిండి సమస్య అప్పటికే అధికంగా ఉంది. అంతలోనే తాలిబన్లు చొరబడి దేశంలో అల్లకల్లోలం సృష్టించారు. మనుషులను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. నా అదృష్టం బాగుండి ప్రాణాలతో అఫ్గాన్ నుంచి బయటపడ్డాను. నా సోదరుడు త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాడని ఆకాంక్షిస్తున్నానంటూ’ మెల్విన్ తాను అఫ్గాన్ నుంచి బయటపడి సొంత ప్రాంతానికి చేరుకున్న తీరును వివరించాడు.