Adult Content Movie Played In The Flight: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు, విమానాల్లో సినిమాలు వేయడం, పాటలు ప్లే చేయడం మామూలే. విమానంలో అయితే ప్రతీ ప్రయాణికునికి ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. మనకు అవసరం లేదనుకుంటే వాటిని ఆఫ్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. కానీ, ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు బయలుదేరిన విమానంలో మాత్రం ప్రయాణికులను చేదు అనుభవం ఎదురైంది. 'అడల్ట్ కంటెంట్' మూవీ ప్లే కావడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. చిన్నారులతో వెళ్తోన్న మహిళా ప్రయాణికులు స్క్రీన్ ఆఫ్ చేసే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అసలేం జరిగిందంటే.?
క్వాంటాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఫ్లైట్ QF59 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు బయల్దేరింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు చాలా మందే ఉన్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులందరి కోసం ఓ చిత్రాన్ని ప్రదర్శించారు. అది 'అడల్డ్ కంటెంట్' (పెద్దలకు మాత్రమే) కావడంతో అంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అది తమకు అవసరం లేదని.. చిత్ర ప్రదర్శన నిలిపేయాలని కొందరు ప్రయత్నించినా సాంకేతిక సమస్యతో అది సాధ్యం కాలేదు. కొంతసేపటికి ఎయిర్ లైన్స్ సిబ్బంది చిత్ర ప్రదర్శనను నిలిపేశారు.
ఇలాంటి ఇబ్బందికర అనుభవంతో విమాన సిబ్బందిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎవరైతే చిత్రం వద్దని కోరారో అలాంటి వారికి అది ఆఫ్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఎలాగోలా ఆ చిత్రాన్ని ఆఫ్ చేసి దానికి బదులుగా పిల్లలకు ఇష్టమైన మరో సినిమాను ప్రదర్శించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో క్షమాపణలు కోరింది. 'విమానంలో ప్రదర్శించిన చిత్రం అందరికీ సంబంధించింది కాదని అర్థమైంది. ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతీ ప్రయాణికుడికి మేం క్షమాపణలు చెబుతున్నాం. వెంటనే ఆ సినిమాను మార్చేసి వేరొక దాన్ని ప్రదర్శించాం. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. సాంకేతిక సమస్య వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.' అని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, అప్పటికే ఈ తతంగాన్ని కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'చిన్నారులు, మహిళలతో ప్రయాణించే వారికి ఇది చాలా ఇబ్బందికరం', 'ఇలాంటి సినిమాలు ప్రదర్శించినప్పుడు కనీసం ఆఫ్ చేసే అవకాశం లేకుండా ఉండడం దారుణం.' అని కామెంట్స్ చేశారు.