Pakistan: వీడెవడండీ బాబూ! - టిక్ టాక్ కోసం ఏకంగా సింహం బోనులోకే వెళ్లాడు, చివరకు!
Viral News: సాధారణంగా సింహాన్ని దూరంగా చూస్తేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ యువకుడు ఏకంగా దానితోనే టిక్ టాక్ వీడియో కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

Pakistan Young Man Tiktok Video With Caged Lion: సోషల్ మీడియా ఫాలోవర్స్, క్రేజ్ కోసం కొందరు పిచ్చి పిచ్చి రీల్స్, వీడియోలు షేర్ చేస్తుంటారు. లైక్స్ కోసం అలా చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఓ యువకుడు ఏకంగా సింహం బోనులోకే వెళ్లి దానితో ఆటలాడాడు. టిక్ టాక్ వీడియో కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ప్రావిన్సుకు చెందిన మహమ్మద్ అజీమ్.. లాహోర్ సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే బోనులో ఉన్న సింహంతో టిక్ టాక్ వీడియో తీసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం అక్కడున్న సిబ్బంది అనుమతి లేకుండానే బోనులోకి వెళ్లి వీడియో తీసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో సింహం వెంటనే అతనిపై దాడికి దిగింది. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది అతన్ని రక్షించారు.
సింహం దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబు స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫామ్ యజమాని బ్రీడింగ్ లైసెన్స్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ కేంద్రంలోని జంతువుల వీడియోలు, ఫోటోలను.. టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల్లో ప్రదర్శించడంపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ఆ వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
Also Read: Hotel Fire: మంచు రిసార్టులో అగ్నిప్రమాదం - 66 మంది సజీవ దహనం ! వీడియో