Japan Earthquake:
భూ ప్రకంపనలు
జపాన్‌లో భూకంపం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురి చేసింది. హొక్కైడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్ర 6.0గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూమి లోపల 46 కిలోమీటర్ల లోతు వరకూ ఈ భూకంప ప్రభావం కనిపించినట్టు German Research Centre for Geoscience స్పష్టం చేసింది. తెల్లవారుజామున 5.44 గంటలకు భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. అయితే...ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్‌తో పాటు టర్కీలోనూ భూకంపం భయపెట్టింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. చాలా ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 23 మంది గాయపడ్డారు. అదియమన్, మలత్యా ప్రావిన్స్‌లలో భూకంపం నమోదైంది. ఇదే ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కూలిపోయే దశలో ఉన్న బిల్డింగ్‌ల వద్ద ప్రజలెవరూ నిలబడొద్దని టర్కీ హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. 11 కిలోమీటర్ల లోతు వరకూ భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.