Balochistan Pakistani Soldiers Killed: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వరుసగా పాక్ సైన్యంపై విరుచుకుపడుతోంది. దాడిలో 27 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ దాడి కలట్ జిల్లాలోని నీమార్గ్ క్రాస్ ప్రాంతంలో సైనికులను తీసుకెళ్తున్న ఒక బస్సుపై జరిగింది. ఈ బస్సులో 48 మందికి పైగా పాక్ సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహిస్తూ, ఇందులో 27 మంది సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఈ దాడిలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ బాంబులు ఉపయోగించినట్లు తెలిపింది, దీనిలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
బలోచ్ రెబల్స్‌చే జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా ఈ ఎటాక్ భావిస్తున్నారు. ఈ దాడి రెండు దిశల నుండి జరిగిన ఒక ప్రణాళికాబద్ధమైన దాడిగా భావిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక రవాణాపై లక్ష్యంగా చేసిన బీఎల్ఏ వ్యూహాత్మక దాడులలో ఒకటిగా భావిస్తున్నారు. బలోచిస్తాన్‌లో జరుగుతున్న తీవ్రమైన తిరుగుబాటు ఉద్యమం, బలోచ్ స్వాతంత్ర్య పోరాటం తీవ్రతను సూచిస్తుంది.
ఈ ఏడాది జనవరి నుండి జూన్ 2025 వరకు, బలోచ్ లిబరేషన్ ఆర్మీ మొత్తం 286 దాడులు చేసినట్లు నివేదికలు తెలిపాయి, ఇందులో 700 మందికి పైగా మరణించారు. ఈ దాడుల్లో మూడు ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి, ఇవి పాకిస్తాన్ సైన్యం మరియు దాని మౌలిక సదుపాయాలపై గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. బీఎల్ఏ తమ దాడులను పాకిస్తాన్ సైనిక లాజిస్టిక్స్, సరఫరా మార్గాలు, మరియు కమ్యూనికేషన్‌ను అడ్డుకోవడంపై కేంద్రీకరించింది, దీనివల్ల పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్‌లో తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని కోల్పోతోంది.
ఈ దాడులు బలోచిస్తాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జరుగుతున్నాయి, ఇక్కడ స్థానిక జనాభా పాకిస్తాన్ ప్రభుత్వం వనరుల దోపిడీ, రాజకీయ ఉపేక్ష, సైనిక ఆక్రమణలపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ అధికారులు ఈ తిరుగుబాటును అణచివేసినట్లు పేర్కొన్నప్పటికీ, ఈ దాడులు ఆ వాదనను సవాలు చేస్తున్నాయి.
అయితే పాకిస్తాన్ మాత్రం వారంతా తమ సైనికులు కాదని.. బలూచిస్తాన్ పౌరులనే.. బీఎల్‌ఏ చంపుతోందని ఆరోపిస్తోంది. కానీ వారు సైనికులేనని బీఎల్‌ఏ చెబుతోంది.