Penguins wash up dead: ప్రకృతి, జంతు ప్రేమికుల హృదయాన్ని కలచి వేసే ఘటన ఉరుగ్వే సముద్ర తీరంలో వెలుగు చూసింది. గత పది రోజులుగా తీరం వెంబడి ఎక్కడబడితే అక్కడ మాగెల్లానిక్ పెంగ్విన్‌లు కళేబరాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా చిన్నపిల్లలు ఉంటున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో చనిపోయి ఉరుగ్వే తీరాలకు కొట్టువచ్చినట్లు భావిస్తున్నారు.


10 రోజుల్లో 2 వేల పెంగ్విన్ల మృతి
గత 10 రోజుల్లో తూర్పు ఉరుగ్వే తీరంలో దాదాపు 2,000 పెంగ్విన్‌లు చనిపోయి కనిపించాయి.  వీటిలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజాగా (బర్డ్ ఫ్లూ) కనిపించలేదని, వాటి మృతికి కారణం తెలియడం లేదని అధికారులు తెలిపారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతుజాలం ​​​​విభాగం అధిపతి కార్మెన్ లీజాగోయెన్ మాట్లాడుతూ.. అట్లాంటిక్ మహాసముద్రంలో పెంగ్విన్లు చనిపోయాయని, ఉరుగ్వే తీరాలకు కళేబరాలు కొట్టుకువచ్చాయని చెప్పారు. మెగెల్లానిక్ పెంగ్విన్‌లు, పిల్ల పెంగ్విన్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.


ఈ మరణాలు అన్నీ నీటిలో జరిగాయని, చనిపోయిన వాటిలో తొంభై శాతం యువ పెంగ్విన్లు ఉన్నాయన్నారు. చనిపోయిన వాటి కడుపులో కొవ్వు నిల్వలు లేవని, ఖాళీ కడుపుతోనే ఉన్నాయన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాకు సంబంధించిన పరీక్షలు సైతం చేశామని వివరించారు. మెగెల్లానిక్ పెంగ్విన్‌లు దక్షిణ అర్జెంటీనాలో ఎక్కవగా నివసిస్తాయని పేర్కొన్నారు. దక్షిణ అర్ధగోళంలో శీతాకాలం వచ్చినప్పుడు వలస వెళ్లాయన్నారు. ఆహారం, వెచ్చని నీటి కోసం ఉత్తరా తీరాలకు వలస వెళ్తాయని వివరించారు. బ్రెజిలియన్ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటో తీరానికి చేరుకుంటాయని చెప్పారు.


పెంగ్విన్లు చనిపోవడం సాధారణం, కానీ ఈ ఇంత పెద్ద సంఖ్య కాదని లీజాగోయెన్ చెప్పారు. గత సంవత్సరం బ్రెజిల్‌లో గుర్తు తెలియని కారణాలతో ఇలాంటి మరణాలు సంభవించాయని గుర్తుచేశారు. లగునా డి రోచా రక్షిత ప్రాంతం డైరెక్టర్ హెక్టర్ కేమారిస్  మాట్లాడుతూ.. అట్లాంటిక్ తీరానికి ఆరు మైళ్ల (10 కిలోమీటర్లు) పొడవునా 500 కంటే ఎక్కువ పెంగ్విన్‌ డెడ్ బాడీలను గుర్తించినట్లు చెప్పారు. పెంగ్విన్ల మరణాలకు కారణాలు వెతికే పనిలో ఉన్నట్లు ఆయన చెప్పారు.


పర్యావరణవేత్తల ఆగ్రహం
మాగెల్లానిక్ పెంగ్విన్ మరణాలపై పర్యావరణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంగ్విన్ల మరణాలు పెరుగుదలకు అక్రమంగా, మితిమీరిన విధంగా చేపలు పట్టడం కారణమని వారు ఆరోపిస్తున్నారు. 1990 నుంచి జంతువులు ఆహార కొరతను ఎర్కొనడం చూస్తున్నామని 2000 నుంచి సమస్య పెరిగి పెద్దదైందని చెప్పారు. వనరులు అతిగా ఉపయోగించబడుతున్నాయని  NGO SOS మెరైన్ వైల్డ్‌లైఫ్ రెస్క్యూకి చెందిన రిచర్డ్ టెసోర్ అన్నారు.


జూలై మధ్యలో ఆగ్నేయ బ్రెజిల్‌ను అట్లాంటిక్‌లోని ఉపఉష్ణమండల తుఫాను తాకినప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా బలహీనంగా ఉన్న పెంగ్విన్లు చనిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాజధాని మోంటెవీడియోకు తూర్పున ఉన్న మాల్డోనాడో బీచ్‌లలో చనిపోయిన పెట్రెల్స్, ఆల్బాట్రోస్, సీగల్స్, సముద్ర తాబేళ్లు, సముద్ర సింహాలను ఇటీవల కనుగొన్నట్లు టెసోర్ చెప్పారు. సముద్ర తీరాల్లో జంతురాశి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెంగ్విన్ మరణాలకు కారణాలు గుర్తించాలని ఆయన కోరారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial