Largest mass resignation: అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక రాజీనామాలు చేస్తున్నారు. ట్రంప్ పరిపాలనలో భాగంగా ప్రవేశపెట్టిన "డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్" కారణంగా సెప్టెంబర్ 30న 1,00,000 మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులు అధికారికంగా రాజీనామా చేస్తున్నారు. దీని వల్ల రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో అతి వేగంగా తగ్గుదల నమోదు అవుతుంది.
ట్రంప్ రెండో సారి పరిపాలన ప్రారంభమైన తర్వాత పరిపాలనలో ఫెడరల్ ప్రభుత్వాన్ని "స్లిమ్‌డౌన్" చేయడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) ప్రణాళికలు అమలు చేసింది. DRP ప్రోగ్రామ్‌లో ఉద్యోగులు ఫిబ్రవరి 6, 2025 నాటికి రాజీనామా చేస్తే, సెప్టెంబర్ 30 వరకు పూర్తి జీతం, ప్రయోజనాలతో అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌పై ఉండవచ్చు. ఇది "స్వచ్ఛంద రాజీనామా"గా చూపించినా చాలా మంది ఉద్యోగులు "భయం , ఒత్తిడి" కారణంగా ఈ ఆప్షన్ ఎంచుకున్నారు.
మొత్తం 2,75,000 ఉద్యోగులు డిఫర్డ్ రెసిగ్నేషన్, వాలంటరీ సెపరేషన్, ఎర్లీ రిటైర్మెంట్, అట్రిషన్‌లతో సహా ఈ సంవత్సరం చివరికి రాజీనామా చేయబోతున్నారు. ఇది 2.3 మిలియన్ సివిలియన్ ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను 2.1 మిలియన్‌కు తగ్గిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఖర్చు 14.8 బిలియన్ డాలర్లు, కానీ లాంగ్-టర్మ్‌లో 28 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు.
మిలిటరీ, ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ స్టాఫ్ వంటి కీలక రంగాల ఉద్యోగుల్ని మాత్రం తప్పించడం లేదు. ఈ రాజీనామాలు ఆగస్టు 2025లో 4.3 శాతంకి చేరిన అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌ను మరింత పెంచుతాయి. ట్రంప్ టారిఫ్‌లు ఆర్థిక అనిశ్చితిని పెంచాయి, జాబ్ మార్కెట్ పడిపోయింది. ఈ రాజీనామాల కారణంగా మెడికైడ్, ACA సబ్సిడీలు ఆలస్యం అవుతాయి. డిజాస్టర్ రిలీఫ్, సోషల్ సెక్యూరిటీ అంశాల్లో సర్వీస్ తగ్గిపోతుంది. కాంగ్రెస్ మంగళవారం ఫండింగ్ ఆమోదించకపోతే షట్‌డౌన్ జరుగుతుంది, మరిన్ని లేఅవుఫ్‌లు వస్తాయి.
ఈ పరిస్థితిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. MAGA సపోర్టర్స్ "బ్యూరోక్రసీ కట్"గా చూస్తున్నారు. అయితే లేబర్ యూనియన్స్ లాసూట్ ఫైల్ చేశాయి. 1990ల్లో క్లింటన్ "రీఇన్వెంటింగ్ గవర్నమెంట్" ప్లాన్‌లో 2,50,000 ఉద్యోగాలను తొలగించారు. కానీ అప్పుడు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఒకే సంవత్సరంలో 3,00,000 ఉద్యోగాలను ట్రంప్ తొలగిస్తున్నారు.