Iranian Rial At Record Low Agian: ఆ దేశ కరెనీలో 10 లక్షలు మీరు ఇస్తే, ప్రతిగా మీకు కేవలం ఒకే ఒక్క డాలర్‌ తిరిగి ఇస్తారు. దీనిని ఇంకోలా చెప్పొచ్చు. మీరు ఒక్క డాలర్‌ తీసుకుని ఆ దేశానికి వెళితే, ఆ దేశ కరెన్సీ 10 లక్షలు ఇస్తారు. ఆ దేశం పేరు ఇరాన్‌ ‍‌(Iran). అమెరికా & యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలను నెత్తి మీద అతి భారంగా మోస్తున్న ముస్లిం దేశం అది. ఇరాన్‌ కరెన్సీ పేరు ఇరానియన్‌ రియాల్‌ (Iranian Rial). దీనిని IRR తో సూచిస్తారు. ఇరాన్ కరెన్సీ ఇరానియన్‌ రియాల్ శనివారం (ఏప్రిల్ 5, 2025) నాడు మళ్లీ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది..

ఇప్పుడు 10,43,000 ఇరానియన్ రియాల్స్‌ కేవలం ఒకే ఒక్క US డాలర్‌తో (US Dollar- Iranian Rial Exchange Value) సమానం. ఇలా కనిష్ట స్థాయికి ఢిమ్కీలు కొట్టడం ఇరాన్‌ కరెన్సీకి గానీ, అక్కడి ప్రజలకు గానీ కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే, ఇదొక సాధారణ విషయంలా మారిపోయింది. ఇంతకుముందు, 2025 మార్చి 20న, పర్షియన్ నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా, 1 మిలియన్ (10 లక్షలు) ఇరానియన్ రియాల్స్ విలువ 1 US డాలర్ కంటే తక్కువకు పడిపోయింది. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి పనులకు వెళ్లడం ప్రారంభించిన నేపథ్యంలో, ఇప్పుడు, ఇరాన్‌ కరెన్సీ విలువ డాలర్‌కు 10,43,000 రియాల్స్‌కు పతనమైంది.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచిన అంతర్జాతీయ ఆంక్షలు వార్తా సంస్థ AP రిపోర్ట్‌ ప్రకారం, తెహ్రాన్‌లో (Tehran - ఇరాన్‌ రాజధాని నగరం) కరెన్సీ మార్పిడి కేంద్రంగా పరిగణించే ఫెర్డోవ్సీ స్ట్రీట్‌లోని వ్యాపారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇరాన్‌ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోతున్న అనిశ్చిత పరిస్థితుల నడుమ, కరెన్సీ మార్పిడి రేటు ప్రదర్శన బోర్డులను మూసివేశారు. కొనసాగుతున్న అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏళ్ల తరబడి తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ముఖ్యంగా, 2018లో, తెహ్రాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రంగా ప్రభావితమైంది.

ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న డొనాల్డ్‌ ట్రంప్2015 ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయడం కోసం, తన యురేనియం (Uranium) నిల్వలను 300 కిలోగ్రాములకు (661 పౌండ్లు) & ఎన్‌రిచ్‌మెంట్‌ను 3.67 శాతానికి పరిమితం ఇరాన్‌ చేసింది. ఈ ఆశావహ చర్యల నడుమ, ఆ సమయంలో, రియాల్ డాలర్‌కు 32,000 వద్ద ట్రేడయింది. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత, డొనాల్డ్‌ ట్రంప్ (US President Donald Trump) ఇరాన్‌పై మళ్ళీ ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. ఇరానియన్ ముడి చమురు & పెట్రోకెమికల్ పరిశ్రమతో వ్యాపారం చేసే 16 సంస్థలపై ఆంక్షలు విధించారు. ఇందులో చైనాలో రాయితీకి అమ్మే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్ UAV & బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలతో ముడిపడి ఉన్న సంస్థలకు కీలక భాగాలను సేకరించేందుకు ఇరాన్, UAE, చైనా కేంద్రంగా పనిచేస్తున్న 6 సంస్థలు, వ్యక్తులపై మంగళవారం (01 ఏప్రిల్‌ 2025) నాడు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఇరాయనియన్‌ రియాల్ విలువను మరింత తగ్గించాయి. చమురు అమ్మకాలు తగ్గడం, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఇరాన్‌ కరెన్సీ తట్టుకోలేకోపోతోంది. ఈ కారణంగా ఇరాన్ రియాల్‌ విలువ తాజా కనిష్టానికి పడిపోయిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.