Driving on railway tracks: హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి వద్ద ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. వికారాబాద్ జిల్లాలోని నాగులపల్లి, శంకర్ పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్ చల్ చేసింది. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఆమె కారు నడిపిన తర్వాత స్థానికులు అడ్డుకుని పట్టుకున్నారు.
రైలు పట్టాలపై యువతి కారు నడపటాన్ని గుర్తించిన కొందరు ఆమెను వారించారు. వారిని ఆమె చాకుతో వారిని బెదిరించింది. ఆ తరువాత రైలు లోకో పైలట్ గమనించి చివరి నిమిషంలో రైలును ఆపారు. యువతిని స్థానికులు పట్టుకున్నారు. శంకర్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను యూపీకి చెందిన సోనీగా గుర్తించారు. రీల్స్ పిచ్చితో ఇలా చేసిందన్న ప్రచారం జరిగింది. కానీ ఆమె మానసిక ఒత్తిడితో ఉన్నట్లుగా గుర్తించారు. యువతి సోనిని వైద్య పరీక్షల కోసం చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సోని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది.ఇటీవల ఆమె ఉద్యోగం పోయింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురయినట్లుగా తెలుస్ోతంది. ఇలా రైల్వే ట్రాక్ పైకి కారుతో వెళ్లే ముందు ఏదో అంశంపై ఫిర్యాదు చేయడానికి శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోక ముందే వెళ్లిపోయింది. ఆ తర్వాత కారులో నేరుగా రైల్వే ట్రాక్ పైకి ఎక్కింది. పోలీస్ స్టేషన్ లో ఆమె బ్యాగ్ మర్చిపోవడంతో పోలీసులు కూడా వెదుకుతున్నారు. అప్పుడే వారికి సమాచారం రావడంతో అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంలోనే ఆ యువతి అలా వెళ్లిందని భావిస్తున్నారు. అయితే అందరూ రీల్స్ కోసమని ప్రచారం చేశారు. కానీ ఆమె రీల్స్ కోసం ఆ పని చేయలేదు. వీడియోను కూడా తీసుకోలేదు. మానసికంగా డిస్ట్రబ్ర్ అయి ఉందని పోలీసులు గుర్తించారు.