బోర్‌వెల్ నుంచి సురక్షితంగా బయటకొచ్చిన బాలుడు
ఛత్తీస్‌గఢ్‌లోని 70 అడుగుల లోతులో పడిపోయిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు దాదాపు నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అధికారులు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుతగలటం వల్ల తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. తరవాత రోబోలను తీసుకొచ్చి బాలుడిని రక్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొత్తానికి 100 గంటల తరవాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాదాపు 500 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది శ్రమించి బాధితుడిని రక్షించారు. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్. బాలుడి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు.
100 గంటల పాటు పాము, కప్పతోనే
అంత లోతులో బాలుడితో పాటు ఓ కప్ప, పాము కూడా ఉన్నాయట. అయినా ఏ భయం లేకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సహకరించాడు బాలుడు. అందుకే సీఎం భూపేష్ బాగేల్ ఆ బాలుడ్ని ఆకాశానికెత్తేశారు. హమారా బచ్చా బహదూర్ హై (ఈ పిల్లాడు ఎంతో ధైర్యవంతుడు) అంటూ ట్వీట్ చేశారు. 104 గంటల పాటు పాముతోనే ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం భయపడకుండా ఉండటం సాధారణ విషయం కాదని అన్నారు సీం భూపేష్. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ సహాయక చర్యల్లో పాలు పంచుకున్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాలుడిని బయటకు తీసుకురావటం ఎంతో సవాలుతో కూడుకున్న పని. కానీ సిబ్బంది ఎంతో స్ట్రాటెజిక్‌గా ఆలోచించి పని పూర్తి చేశారని వివరించారు. ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి వీడియో కాల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించారు సీఎం భూపేష్ బాగేల్. బోర్‌వెల్ ద్వారానే బాలుడికి అరటిపండ్లు, బిస్కెట్లతో పాటు ఆక్సిజన్‌నీ అందించారు. మొదటి మూడు రోజులు రెస్క్యూ
ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆ సమయంలోనే గుజరాత్ వాసి ఒకరు రోబోల సాయంతో బాలుడిని బయటకు తీసుకు రావచ్చని సూచించారు. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్‌ల కోసమే తాను ప్రత్యేకంగా రోబోలను తయారు చేశానంటూ చెప్పారు. వెంటనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ఆయనను సంప్రదించారు. రోబో సాయంతో మొత్తానికి బాలుడిని సురక్షింతగా బయటకు తీసుకొచ్చారు. మరెక్కడ బోర్‌వెల్స్ ఉన్నా వాటిని సరైన విధంగా మూసివేయాలంటూ ఎస్‌పీలు,కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అప్పటికప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించటం లేదు. బోర్‌వెల్స్‌ని సరైన విధంగా కప్పి ఉంచాలన్న ఆదేశాలనూ ఎవరూ పట్టించుకోవటం లేదు.