America President : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తన మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేశారు. అంతే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, డొనాల్డ్ ట్రంప్‌కు అతిపెద్ద మద్దతుదారు, టెస్లా బాస్‌ ఎలాన్ మస్క్ ను కూడా తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిగా మారనున్నారా అన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో అమెరికాకు మస్కే అధ్యక్షుడు అవుతాడంటూ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ట్రంప్ స్పందించారు. మస్క్‌ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని తేల్చి చెప్పారు.






అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌ తొలిసారి అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్‌ అమెరికా అధ్యక్షుడు కానున్నారన్న వార్తలపై మాట్లాడారు. ‘ఎలాన్‌ మస్క్‌ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే.. ఆయన అమెరికాలో పుట్టలేదు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 'అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కానీ, మస్క్‌.. దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. మస్క్ చాలా కష్టపడి పని చేసే వ్యక్తి' అని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.


'నాకు తెలివైన వ్యక్తులంటే ఇష్టం. ఎలోన్ మస్క్ ఏం చేసిన చాలా గొప్పగా చేస్తాడు. నాకు స్మార్ట్ వర్క్ చేసే వారితో పాటు నమ్మదగిన వ్యక్తులు కూా కావాలి. కానీ అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే ఈ దేశంలో పుట్టాల్సిందే అని ట్రంప్ తెలిపారు. అమెరికా కొత్త ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ పాత్ర ట్రంప్ కంటే పెద్దదిగా ఉంటుందని డెమొక్రాట్ల విమర్శల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 


విమర్శలపై ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే..


డెమొక్రాట్ల నుంచి వస్తోన్న విమర్శలకు సంబంధించి ఎలాన్ మస్క్ తన మద్దతు మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్‌కే ఉందని స్పష్టంగా చెప్పారు. ట్రంప్ హయాంలో అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఇకపోతే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ అత్యంత మద్దతుదారిగా నిలిచిన మస్క్.. బహిరంగంగానూ డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు, ప్రచారం చేశాడు. అదే సమయంలో, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలను ఎలాన్ మస్క్, భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామికి అప్పగించారు. ఇదిలా ఉండగా మంత్రివర్గంలో చేరిన మస్క్ కు ట్రంప్ ‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు.  


Also Read : Blue Christamas 2024: బ్లూ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు- విశిష్టత, సెలబ్రేట్ చేసుకునే విధానం ఇదీ