BJP MP Varun Gandhi:
సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ విమర్శలు...?
యూపీలోని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ మారతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మధ్య కాలంలో సొంత పార్టీపైనే నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే...ఆయన బీజేపీని వీడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనీ అంటున్నారు. బీజేపీని విమర్శించే విధంగా హిందూ ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. రైతుల ఉద్యమం
చేసిన సమయంలో వారికి అండగా నిలబడి ఆహారం అందించిన వారికి మద్దతుగా మాట్లాడారు వరుణ్ గాంధీ. ఈ కారణంగా...ఆయన బీజేపీకి దూరం అవుతున్నారన్న సంకేతాలొచ్చాయి. దీనిపై రాహుల్ గాంధీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతున్నారా అన్న ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పారు రాహుల్. "ఈ ప్రశ్న మీరు మా పార్టీ అధ్యక్షుడు ఖర్గేని అడగాలి" అని దాట వేశారు. అయితే...భారత్ జోడో యాత్రకు ఎవరు మద్దతు ఇచ్చినా మేం స్వాగతిస్తామని స్పష్టం చేశారు. "ప్రస్తుతం వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఎప్పుడో అప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి సమస్యలు ఎదుర్కోక తప్పదు" అని అన్నారు. దేశానికి కొత్త దారి చూపించేందుకే...భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు వెల్లడించారు. తన ఉద్దేశం కూడా నెరవేరిందని తెలిపారు. ప్రెస్‌కాన్ఫరెన్స్ చాలా సేపు మాట్లాడిన రాహుల్...2024 ఎన్నికల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమేనంటూ జోస్యం చెప్పారు. చాలా చోట్ల బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు.
స్పీచ్ వైరల్..
ఈ మధ్య వరుణ్ గాంధీ ప్రసంగం ఒకటి బాగా వైరల్ అయింది. సొంత పార్టీని పరోక్షంగా విమర్శించినట్టుగానే అనిపించింది. "పండిట్ నెహ్రూకి కానీ, కాంగ్రెస్‌కు కానీ నేను వ్యతిరేకం కాను. రాజకీయాలేవైనా సరే మన దేశాన్ని సమష్టిగా ఉంచాలి. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉండకూడదు. వాళ్లను అణగదొక్కే రాజకీయాలు చేయడం మానుకోవాలి. రాజకీయాలెప్పుడూ ప్రజలు ఎదిగేలా ఉండాలి. ఇప్పుడంతా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. కుల రాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయి. సోదరుల్లాంటి వాళ్లు విడదీస్తున్నారు. ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలను ఎప్పటికీ ఉపేక్షించకూడదు" అని అన్నారు వరుణ్ గాంధీ.