Jay Chaudhry top immigrant billionaire of America: అమెరికాలో భారత సంతతి వ్యక్తుల్లో అత్యంత ధనవంతుడు జయ్ చౌదరి. ఈ పేరు ఎప్పుడూ విని ఉండరు. కానీ   సైబర్‌సెక్యూరిటీ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన వ్యక్తి, 2025 ఫోర్బ్స్ జాబితాలో అమెరికాలోని అత్యంత ధనవంతులైన వలస వచ్చిన బిలియనీర్లలో 8వ స్థానంలో నిలిచారు. ఆయన జస్కేలర్ (Zscaler) అనే సైబర్‌సెక్యూరిటీ సంస్థ స్థాపకుడు ,  సీఈఓ కూడా.   2008లో  ప్రారంభించి  2018లో పబ్లిక్ కంపెనీగా మారింది. ఫోర్బ్స్ ప్రకారం, 2025లో జయ్ చౌదరి నికర సంపద  17.9 బిలియన్ డాలర్లు. మన రూపాయాల్లో సుమారు  1.49 లక్షల కోట్లు.  అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి వ్యక్తిగా నిలిపింది.  

జయ్ చౌదరి 1959లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలోని పనోహ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈ గ్రామంలో విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఆయన చిన్నతనంలో చెట్టు కింద చదువుకునే వారు. ఎనిమిదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నారు.  ఎన్ని ఆటంకాలు ఉన్నా చదువు  మాత్రరం ఆపలేదు. జయ్ చౌదరి ఐఐటీ-బనారస్ హిందూ యూనివర్సిటీ (IIT-BHU) నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీ.టెక్ పూర్తి చేశారు.  1980లో ఆయన అమెరికాకు  వెళ్లి, సిన్సినాటి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్,  మేనేజ్‌మెంట్‌లో మూడు మాస్టర్స్ డిగ్రీలను పొందారు.  ఆ తర్వాత, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. 

1996లో జయ్ చౌదరి, ఆయన భార్య జ్యోతి చౌదరి ఇద్దరూ తమ ఉద్యోగాలను వదిలి.. అప్పటి వరకూ సంపాదించిన సొమ్ముతో సెక్యూర్‌ఐటీ అనే సైబర్‌సెక్యూరిటీ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థ విజయవంతంగా నడిచింది. ఈ కంపెనీని వెరిసైన్ (Verisign) సంస్థ  కొనుగోలు చేసింది.  సెక్యూర్‌ఐటీ తర్వాత, చౌదరి సైఫర్‌ట్రస్ట్ (CipherTrust), కోర్‌హార్బర్ (CoreHarbor),   ఎయిర్‌డిఫెన్స్ (AirDefense) అనే సైబర్‌సెక్యూరిటీ సంస్థలను స్థాపించారు. ఈ నాలుగు సంస్థలను కూడా పెద్ద కంపెనీలచే కొనుగోలు చేశారు. ఎయిర్‌డిఫెన్స్ 2008లో మోటరోలా  కొనుగోలు చేసింది. 

2008లో జయ్ చౌదరి జస్కేలర్‌ను స్థాపించారు, ఇది క్లౌడ్-ఆధారిత సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. ఈ సంస్థ "జీరో ట్రస్ట్" ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేసి, సంప్రదాయ ఫైర్‌వాల్‌లకు బదులుగా క్లౌడ్ ఆధారిత భద్రతను ప్రోత్సహించింది. జస్కేలర్ 2018లో నాస్‌డాక్‌లో పబ్లిక్ కంపెనీగా మారింది, దీని మార్కెట్ విలువ 2025 నాటికి  20 బిలియన్ డాలర్ల నుంచి  50 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.   చౌదరి  ఆయన కుటుంబం ఈ సంస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నారు. జస్కేలర్ ప్రపంచవ్యాప్తంగా సంస్థలకు డిజిటల్ నెట్‌వర్క్‌లను రక్షించే సేవలను అందిస్తుంది, ఇది ఆధునిక డిజిటల్ యుగంలో సురక్షితమైన క్లౌడ్ ఆధారిత కార్యకలాపాలను సులభం చేస్తుంది.  ఫోర్బ్స్ 2025 జాబితా ప్రకారం  అమెరికాలో 125 మంది వలస వచ్చిన బిలియనీర్లు ఉన్నారు. వీరు 43 దేశాల నుంచి వచ్చారు.   భారతదేశం 12 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది, ఇజ్రాయెల్ ,  తైవాన్‌ల నుంచి  11 మంది బిలియనీర్లు ఉన్నారు.  జాబితాలో సుందర్ పిచాయ్  , సత్య నాదెళ్ల,  నికేష్ అరోరా  , వినోద్ ఖోస్లా   వంటి ఇతర భారత సంతతి వ్యక్తులు కూడా ఉన్నారు. జయ్ చౌదరి ఈ జాబితాలో అత్యధిక సంపద కలిగిన భారత సంతతి వ్యక్తిగా నిలిచారు.