What is non veg milk : పాలు మాత్రం మనకు తెలుసు. ఈ పాలల్లో శాకాహార.. మాంసాహార పాలు ఉంటాయని మనకు తెలియదు. కానీ నాన్ వెజ్ మిల్క్ ఉన్నాయి. మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటారు. అసలు ఆవులేంటి.. మాంసాహారం తినిపించడం ఏమిటి.. వాటి నుంచి పాలు ఏమిటి అన్నది భారతీయులకు కొత్తగానే ఉంటుంది.
భారతదేశం , అమెరికా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలలో కొన్ని వస్తువులపై పన్నుల అంశంపై పీటముడిపడుతోది. ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ ఎగుమతి దేశాలలో ఒకటిగా అమెరికా ఉంది. భారత 16.8 బిలియన్ డాలర్ల డెయిరీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని అమెరికా ఆశిస్తోంది. భారతదేశం ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారు , వినియోగదారు దేశం కూడా.
అమెరికాలో ఆవులకు మాంసం, రక్తం, పౌల్ట్రీ లిట్టర్ అంటే కోళ్ల ఈకలు , వ్యర్థాల మిశ్రమం, చేపలు ఇతర జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారం ఇస్తూంటారు. వాటి నుంచి తీసే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటున్నారు. ఈ పాలు భారతదేశంలోని సాంస్కృతిక , ఆధ్యాత్మిక నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో పాలు కేవలం ఆహారం కాదు ఆధ్యాత్మిక ఆచారాలలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవతలకు పాలు సమర్పించడం, హోమాలలో నెయ్యి ఉపయోగించడం వంటి పవిత్ర కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలు ఈ నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని భారతదేశం భావిస్తోంది.
భారతదేశంలో దాదాపు 38 శాతం జనాభా శాకాహారులు. మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలను వినియోగించడం వారి ఆహార ఆచారాలకు , మత విశ్వాసాలకు విరుద్ధం. భారతదేశ డెయిరీ రంగం 80 మిలియన్ల మంది చిన్న రైతులకు జీవనోపాధిని అందిస్తుంది. అమెరికా నుండి డెయిరీ దిగుమతులను అనుమతిస్తే, రూ. 1.03 లక్షల కోట్ల వార్షిక నష్టం వాటిల్లవచ్చని ఎస్‌బీఐ నివేదిక హెచ్చరించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండ్రీ అండ్ డెయిరీ ఆవులకు జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారం ఇవ్వకూడదని నిబంధన పెట్టింది. కానీ అమెరికా అనుమతి కోరుతోంది. కానీ భారతదేశం “నాన్-నెగోషియబుల్ రెడ్ లైన్”గా ప్రకటించింది. అయితే అమెరికా భారతదేశం సర్టిఫికేషన్ నియమాలను “అనవసరమైన వాణిజ్య అడ్డంకులు”గా విమర్శిస్తోంది. అమెరికా గత సంవత్సరం 8.22 బిలియన్ డాలర్ల డెయిరీ ఎగుమతులతో ప్రపంచంలోని ప్రముఖ డెయిరీ ఎగుమతిదారులలో ఒకటి. కానీ భారత మార్కెట్‌లోకి ఇంకా అడుగు పెట్టలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 1, 2025 నాటికి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఒక గడువు విధించారు. నాన్ వెజ్ పాలను అనుమతించవద్దని భారతీయులు ఎక్కువ మంది కోరుతున్నారు.