ED filing cases against Kaleshwaram engineers for corruption: కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.  ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో  పెళ్లిళ్లు నిర్వహించడంపై ఇప్పటికే వివరాలు సేకరించింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు కంపెనీల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ పెట్టుబడులపై ఈడీ విచారణ నిరవహించనుంది.  కాళేశ్వరం EE నూనె శ్రీధర్ కొడుకు పెళ్లి థాయ్‌ ల్యాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఇందు కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు.  ఆ ఖర్చులపై విచారణ చేపట్టనుంది. అలాగే మొదటిసారి కాళేశ్వరం వ్యవహారంలో ఇంజనీర్ల అవినీతితో పాటు నగదు లావాదేవీలపైనా విచారణ జరిపే అవకాశం ఉంది.  నూనె శ్రీధర్, మురళీధర్ రావు, హరిరామ్ నాయక్‌ కు సంబంధించిన అవినీతి కేసు వివరాలు తమకు ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. 

కాళేశ్వరం పనుల్ని చూసుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావుపై ఏసీబీ గురి పెట్టింది. ఆయనకు సంబంధించిన పన్నెండు చోట్ల సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు గుర్తించింది.  కొండాపూర్‌లో ఒక విల్లా, బంజారాహిల్స్‌లో ఒక ఫ్లాట్,  యూసుఫ్‌గూడలో ఒక ఫ్లాట్, బేగంపేటలో ఒక ఫ్లాట్,  కోకాపేటలో ఖరీదైన ప్లాట్ ఉన్నాయి. మరో చోట పదకొండు ఎకరాలు ఉన్నాయి. ఇంకా బయటపడాల్సిన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.  మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రిమాండ్ కు పంపించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో  మరో మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాం ఇంటితో సహా 14 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది.  ఆయన వద్ద కూడా తక్కువ దొరకలేదు.   షేక్‌పేట్  కొండాపూర్‌లో రెండు లగ్జరీ విల్లాలు,   శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలో మూడు ఫ్లాట్లు,   అమరావతిలో వాణిజ్య స్థలం ,   సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి,   పటాన్‌చెరులో 20 గుంటల భూమి,  శ్రీనగర్ కాలనీలో రెండిళ్లు,  బొమ్మలరామరం మండలంలో 6 ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్‌హౌస్,  కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం.. ఇంకా పలు రకాల   ఆస్తులు, బంగారాన్ని పట్టుకున్నారు.  హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపారు.   జూన్ లో  కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపైనా దాడులు చేశారు.   నూనె శ్రీధర్ ఇంటితో సహా 14 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో  రూ. 60 కోట్ల   ఆస్తులు గుర్తించారు. ఇది ప్రభుత్వ రేటు..  బహిరంగ మార్కెట్ లో ఐదు వందల కోట్లకుపైగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

అవినీతిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అయితే ఆ డబ్బుల్ని అనధికారికంగా ..  చట్ట విరుద్ధంగా చెలామణి చేయడంపై ఈడీ దృష్టి పెడుతుంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులు.. బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం కంపెనీలు పెట్టినట్లుగా గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగుతోంది.