West Bengal SSC Scam:
ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో పార్థ ఛటర్జీ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. స్కూల్ సర్వీస్ కమిషన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ, రూ.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. పార్థ ఛటర్జీ ఇతర సన్నిహితులందరి ఇళ్లపైనా ఈడీ దాడులు చేస్తోంది. ఛటర్జీ విద్యాశాఖా మంత్రిగా ఉన్న సమయంలో సెక్రటరీగా ఉన్న సుకాంత అచర్జీతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చందన్ మొండల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. టీచర్ ఉద్యోగం ఇస్తామని పెద్ద మొత్తంలో చందన్ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని ఐదుగురు సభ్యుల కమిటీ కన్వీనర్ ఇంట్లోనూ రెయిడ్ జరిగింది. ఈ అందరి ఇళ్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫారిన్ కరెన్సీని రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
ఏంటీ స్కామ్..?
స్కూల్ సర్వీస్ కమిషన్‌లో భాగంగా ఉపాధ్యాయుల నియామకంలో అప్పటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ చేతివాటం చూపించినట్టు ఆరోపణలున్నాయి. ఆయన సన్నిహితుంలదరూ కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్టు భాజపా ఆరోపిస్తోంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కలకత్తా హై కోర్టు ఈ కేసుని విచారించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల నియామకాలు సహా అసిస్టెంట్ టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. అప్పటి నుంచి దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈడీ అధికారులు సోదాలు వేగవంతం చేయటం వల్ల ఒక్కసారిగా ఈ స్కామ్ గుట్టు బయటపడింది. శుక్రవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు దక్షిణ కోల్‌కతాలో ఉన్న పార్థ చటర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో రెండుసార్లు సీబీఐ పార్థ ఛటర్జీని విచారించింది.
ఇది ట్రైలర్ మాత్రమే..
ఈ కేసు విషయంలో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్ష అని తృణమూల్ మండిపడుతుంటే, కచ్చితంగా స్కామ్ జరిగిందని భాజపా చెబుతోంది. భాజపా ఇప్పటికే ట్విటర్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో అర్పిత ముఖర్జీతో పాటు సీఎం మమతా బెనర్జీ కూడా ఉన్నారు. "ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా ఉంది" అని సువేందు అధికారి ట్వీట్ చేశారు.