Indian Flogs: విశాఖ జిల్లాలో ఆగస్టు 11 నుండి 15 వరకూ జాతీయ పతాకాలు ప్రతీ ఇంటిపైనా రెపరెపలాడనున్నాయి . వీటికోసం వైజాగ్ జిల్లాలో ఇళ్ల సంఖ్య 5 లక్షల 57 వేల 576 ఉంటాయని అంచనా వేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఇంటికీ జాతీయ పతాకాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ లెక్క కోసం 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. అప్పటి లెక్కల ప్రకారమే విశాఖ జిల్లాలో 4 లక్షల 97 వేల వరకూ ఇళ్ళు ఉంటాయని అంచనా అధికారులు అంచనా వేశారు. వైజాగ్ సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామీణ మండలాల్లో గల వాలంటీర్ల సాయంతో ప్రతీ ఇంటికీ జాతీయ పతాకాన్ని పంపిణీ చెయ్యాలని విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. 


బీచ్ రోడ్డులో 100 అడుగుల జాతీయ పతాకం..


దీనికోసం 10 వేల 331 మంది వాలంటీర్లను ఉపయోగించుకోనున్నారు. వీరితో పాటు విశాఖ జిల్లాలో ఉన్న 607 గ్రామాల్లోని గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సేవలనూ వాడుకోనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే జిల్లాలోని 607 సచివాలయాలు, 625 రేషన్ షాపుల వద్ద జాతీయ పతాకాలను ఎగుర వేస్తున్నారు. వారితో పాటు అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వారరి వారి ఆఫీసుల్లో జెండాను ఎగురవేస్తుండగా..   సిటీలోని బీచ్ రోడ్ లో 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆగస్టు 11 నుండి 15 వరకూ ఎగుర వేయాలని నిర్ణయించారు. 


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి..


భారత దేశానికి పరాయి పాలన నుండి స్వేచ్ఛ వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపును ఇచ్చింది. అందులో భాగంగానే దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు ప్రతీ నగరాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. విశాఖ నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలతో డెకరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని బావికొండ, తొట్లకొండ లాంటి చారిత్రిక ప్రాంతాలతో పాటు , సింహాచలం వంటి పుణ్య క్షేత్రాలనూ అందంగా తీర్చిదిద్దనున్నారు.


తనదైన ముద్ర వేసేందుకు తయారవుతున్న విశాఖ..


ఆగస్టు 1 న గ్రామాల వారీగా సభలు నిర్వహించి, రెండో తారీఖున జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మదినాన్ని ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 11 న హెరిటేజ్ వాక్, 12న స్పోర్ట్స్ కాంపిటీషన్స్, 13న ప్రతీ ఒక్కరూ జాతీయ పతాకాన్ని ధరించడం, 14 న స్వాతంత్య్ర సమర యోధుల ఇళ్లకు వెళ్లి వారిని సత్కరించాలని, 15 న ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని కేంద్రం తెలిపింది. ఆ కార్యక్రమాలకు అనుగుణంగా విశాఖ సిటీ కూడా తనదైన ముద్ర చూపేందుకు రెడీ అవుతుందని కలెక్టర్ డాక్టర్ మల్లి ఖార్జున తెలిపారు.