Bengal SSC Scam: 


ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..


స్కూల్ సర్వీస్ కమిషన్‌లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఉన్న ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతకు ముందు కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ మీటింగ్‌లో పార్థ ఛటర్జీ గురించి ఎలాంటి చర్చ రాలేదని అంతకు ముందు సమాచారం వచ్చింది. కానీ...ఈ భేటీ ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించటమే మంచిది" అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు. తరవాత ఆ ట్వీట్‌ తొలగించారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ నిర్ణయం ప్రకటించక ముందు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్టీ ఈ అంశంపై చర్చిస్తోందని చెప్పారు. మీటింగ్ జరిగిన తరవాతే దీనిపై అధిష్ఠానం ప్రకటన చేస్తుందని వెల్లడించారు. అయితే గతంలోనే అధిష్ఠానం ఈ విషయమై ఓ ప్రకటన చేసింది. మంత్రి పార్థ ఛటర్జీ తప్పు చేశారని కోర్టు తేల్చి చెబితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.





 


అర్పిత ముఖర్జీకి, పార్టీకి సంబధం లేదు..


ఈడీ అరెస్ట్ చేసిన అర్పిత ముఖర్జీకి, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ స్పష్టం చేసింది. "న్యాయవ్యవస్థపైన నమ్మకముంది. ఒకవేళ పార్థ ఛటర్జీ తప్పు చేసినట్టు కోర్టు తేల్చి చెబితే, పార్టీ, ప్రభుత్వం కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకుంటుంది" అని కునాల్ ఘోష్ చెప్పారు. స్కూల్ సర్వీస్ కమిషన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ, రూ.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. పార్థ ఛటర్జీ ఇతర సన్నిహితులందరి ఇళ్లపైనా ఈడీ దాడులు చేస్తోంది. ఛటర్జీ విద్యాశాఖా మంత్రిగా ఉన్న సమయంలో సెక్రటరీగా ఉన్న సుకాంత అచర్జీతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చందన్ మొండల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. టీచర్ ఉద్యోగం ఇస్తామని పెద్ద మొత్తంలో చందన్ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని ఐదుగురు సభ్యుల కమిటీ కన్వీనర్‌ ఇంట్లోనూ రెయిడ్‌ జరిగింది. ఈ అందరి ఇళ్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫారిన్ కరెన్సీని రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అర్పిత ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో సోదాలు చేసిన ఈడీ, రూ.29 కోట్లను స్వాధీనం చేసుకుంది.