Deportation of illegal migrants India: బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారు తిరిగి వెళ్లడంపై దేశవ్యాప్తంగా భిన్నమైన చర్చ జరుగుతోంది. పాతికేళ్లకిందట వచ్చి ఇక్కడే కుటుంబాలను ఏర్పాటు  చేసుకున్న వారిపై సానుభూతి చూపించాలని కొంత మంది అంటున్నారు. అయితే వారిని వెనక్కి పంపేయాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  బంగ్లాదేశ్ ఏర్పడిన 1971 యుద్ధం తర్వాత మొదలైన వలసల పరంపర నేటికీ ఆగలేదు. వివిధ ప్రభుత్వ నివేదికలు .  అంతర్గత విశ్లేషణల ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం సుమారు  1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశ్ పౌరులు నివసిస్తున్నారని అంచనా. కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే ఏటా లక్షలాది మంది సరిహద్దులు దాటుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దశాబ్దాల క్రితం వచ్చిన వారు ఇక్కడి స్థానిక రాజకీయ అండదండలతో రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు వంటి  ఫోర్జరీ పత్రాలు సృష్టించుకుని భారతీయ పౌరులుగా చలామణి అవుతుండటం ఇప్పుడు అసలు చిక్కుగా మారింది.

Continues below advertisement

 ఎందుకు రానిచ్చారు? 

ఇంత పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతున్నా ఇన్నాళ్లూ ఎందుకు ఉపేక్షించారన్న దానికి ప్రధాన కారణం  ఓటు బ్యాంక్ రాజకీయం. సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని రాజకీయ పార్టీలు ఈ చొరబాటుదారులను తమ శాశ్వత ఓటు బ్యాంకులుగా మార్చుకోవడానికి వారికి రక్షణ కల్పించడమే కాకుండా, భారతీయ గుర్తింపు పత్రాలు లభించేలా సహకరించాయి. 4,096 కిలోమీటర్ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో చాలా ప్రాంతం నదీ తీరాలు, చిత్తడి నేలలు  కావడం కూడా చొరబాటుదారులకు వరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, మతపరమైన వేధింపులు ,  మెరుగైన ఉపాధి కోసం బంగ్లాదేశీయులు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

Continues below advertisement

ఆర్థిక వనరులపై భారం - పన్ను చెల్లింపుదారుల ఆందోళన 

మన దేశంలోని వనరులు మన పౌరులకే సరిపోని తరుణంలో, కోట్లాది మంది అక్రమ వలసదారులకు ఉచిత రేషన్, వైద్యం, విద్య,  గృహనిర్మాణ పథకాలు కల్పించడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారం. సామాన్య భారతీయుడు చెల్లించే పన్నుల ద్వారా లభించే సంక్షేమ ఫలాలు చొరబాటుదారుల పాలవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో జనాభా మార్పిడి జరిగి, స్థానిక భూమిపుత్రులు మైనారిటీలుగా మారుతున్నారనే ఆందోళన పెరుగుతోంది.   

సానుభూతి వర్సెస్ దేశ భద్రత 

మానవతా దృక్పథం పేరుతో సానుభూతి చూపే వారు.. వీరు పాతికేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారని, వారి పిల్లలు ఇక్కడే పుట్టారని వాదిస్తున్నారు. అయితే, చట్టపరంగా చూస్తే  అక్రమ ప్రవేశం  ఎప్పటికీ అక్రమమే అవుతుంది. అక్రమంగా వచ్చిన వారు మన దేశం పట్ల విధేయులుగా ఉంటారని గ్యారెంటీ లేదు. దేశ భద్రతా కోణంలో చూస్తే, ఉగ్రవాద మూలాలున్న శక్తులు ఈ చొరబాటుదారుల ముసుగులో దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. జాతీయ భద్రత,  పౌరుల ప్రయోజనాల ముందు వ్యక్తిగత సానుభూతికి తావు లేదని ఢిల్లీ పెద్దలు  డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని వేగవంతం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన  హోల్డింగ్ సెంటర్ల  ఏర్పాటు చేయడంతో బంగ్లాదేశీయులు.. స్వదేశానికి వెళ్లిపోతున్నారు.