Outsourcing Employees Letter to Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) దివాలాకోరు పాలనలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన్ను, గాజువాక (Gajuwaka) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ శ్రీనగర్ లో సోమవారం వాటర్ సప్లై ఇంజినీరింగ్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. తాము 20 ఏళ్లుగా నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్నామని తమను మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులుగా మార్చేలా చొరవ చూపాలని వినతిపత్రం సమర్పించారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019, ఫిబ్రవరి 8న జీవో 96 ద్వారా మమ్మల్ని మినిమం టైమ్ స్కేల్ కార్మికులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యేలోపు ప్రభుత్వం మారిపోయింది. ప్రస్తుతం మాకు రూ.13 వేల వేతనం మాత్రమే వస్తుంది. మాకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వడంతో ప్రభుత్వ పథకాలు సైతం అందడం లేదు. ఎంటీఎస్ ను అమలు చేయాలి.' అని లోకేశ్ కు విన్నవించారు. అలాగే, కరోనాలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరారు.


లోకేశ్ హామీ


దీనిపై స్పందించిన లోకేశ్, పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం జగన్ మాటలు నమ్మి మోసపోయారని అన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చి మాట తప్పడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో రూ.వందల కోట్లు వెచ్చించి సత్యసాయి మంచినీటి పథకాన్ని నిర్మిస్తే ఉద్యోగులకు జీతాలు, నిర్వహణ ఖర్చులు ఇవ్వలేక నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్ వర్క్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిబంధనలకు లోబడి కరోనా సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిశీలిస్తాన్నారు.


ముగిసిన 'యువగళం'


కాగా, నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర సోమవారం సాయంత్రం ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించి ఆయన తన పాదయాత్రను ముగించారు. చివరి రోజు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించగా, తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులతో కలసి ఆయన ముందుకు నడిచారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపు సంద్రాన్ని తలపించింది. పైలాన్ ఆవిష్కరణ అనంతరం లోకేశ్, తన పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాగా, రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు  ఆయన పాదయాత్ర సాగింది. సోమవారం ముగింపు సమయానికి లోకేశ్, 3,132 కి.మీలు నడిచినట్లైంది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహిస్తోంది.


Also Read: Nara Lokesh: 'యువగళం' ముగింపు సభకు రానున్న జనసేనాని పవన్