Pawan Kalyan Will Attend Nara Lokesh Yuvagalam Closing Ceremony: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) 'యువగళం' (Yuvagalam) ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. విజయనగరం (Vijayanagaram) జిల్లా భోగాపురం (Bhagapuram) మండలం పోలిపల్లి వద్ద ఈ నెల 20న పాదయాత్ర విజయోత్సవ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, తాను హాజరు కాలేనని తొలుత పవన్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరవుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 'యువగళం' సభకు హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


నేటితో ముగియనున్న పాదయాత్ర


చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా (Visakhapatnam ) అగనంపూడి వద్ద ముగియనుంది. పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ మొత్తం 3,132 కి.మీ పూర్తి చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రను సైతం అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంటుతో ఇప్పుడు లోకేశ్ కూడా అక్కడే ముగిస్తున్నారు. ఈ క్రమంలో 20న నిర్వహించబోయే విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ, టీడీపీ ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.


ఎన్నికల శంఖారావం


ఏపీలో రాబోయే ఎన్నికల శంఖారావానికి 'యువగళం' ఇరు పార్టీలకు వేదిక కానుంది. టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం ఈ వేదికపై పూరించనున్నారు. అదే రోజున కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సభకు లక్షలాది మంది వస్తారన్న అంచనాలతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. దాదాపు, 5 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో 7 ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు.


పాదయాత్ర సాగిందిలా


నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు ఓ విద్యార్థిలానే వ్యవహరించారు. పొలాల్లోకి వెళ్లారు, మహిళలతో మమేకం అయ్యారు. రైతులతో ముచ్చటించారు. కూలీల కష్టాలు తెలుసుకున్నారు. నిరుద్యోగుల బాధలకు చలించారు. అణగారిన వర్గాల ఆక్రందన ఆలకించారు. అన్ని వర్గాల ప్రజలకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఏ జిల్లాల్లో ఏయే సమస్యలు ఉన్నాయి ? ప్రజల బాధలు ఏంటి ? ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుందో అన్నీ అవగాహన చేసుకున్నారు. పాదయాత్రతో ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుని, తనదైన రీతిలో వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన లోకేష్‌, 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 ,028 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. 


రాయలసీమ టూ ఉత్తరాంధ్ర


స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించారు లోకేశ్. తొలి రోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు సమయం వెచ్చించారు. కార్యకర్తలకు బీమా వంటి కొత్త విధానాల రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలని కలిసినప్పటికీ ఇంతగా మమేకమయ్యే అవకాశం ఆయనకు గతంలో ఎప్పుడూ రాలేదు. రాయలసీమలో పాదయాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించారు. ప్రారంభం నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనతో మేము సైతం అంటూ కి.మీల కొద్దీ కలిసి నడిచారు. వై​సీపీ పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీశారు. సమస్యలు తీర్చాలంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. 


Also Read: 25 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ స్థానాలు- ఏమంటారు? చంద్రబాబు, పవన్ చర్చల్లో ఇదే హైలెట్‌